ఆరు హెలికాప్టర్లతో ఈ దీవిపై విషాన్ని కుమ్మరిస్తున్నారు... కారణం ఇదే!

Marion Island poison operation with six helicopters and the reason behind it
  • మారియన్ దీవిలో సముద్ర పక్షులకు ముప్పుగా మారిన ఎలుకలు
  • లక్షలాది ఎలుకల నిర్మూలనకు భారీ ఆపరేషన్
  • హెలికాప్టర్లతో 550 టన్నుల విషపు ఎర జల్లేందుకు ప్రణాళిక
  • ప్రాజెక్టుకు స్విస్ ఫౌండేషన్ నుంచి 10 మిలియన్ డాలర్ల విరాళం
  • ప్రపంచంలోనే అతిపెద్ద ఎలుకల ఏరివేత ఆపరేషన్లలో ఒకటిగా గుర్తింపు
సముద్ర పక్షుల సంతతిని సంరక్షించే లక్ష్యంతో దక్షిణాఫ్రికాలోని మారియన్ ద్వీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆపరేషన్లలో ఒకటి నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ ద్వీపంలో పక్షుల మనుగడకు ముప్పుగా పరిణమించిన లక్షలాది ఎలుకలను నిర్మూలించేందుకు, 6 హెలికాప్టర్ల సహాయంతో సుమారు 550 టన్నుల విషపురిత ఎరను వెదజల్లేందుకు ప్రణాళికలు రూపొందించారు.

కేప్ టౌన్‌కు ఆగ్నేయంగా 1,900 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మారుమూల ద్వీపం, దశాబ్దాలుగా సముద్ర పక్షులకు కీలకమైన ప్రజనన కేంద్రంగా విరాజిల్లుతోంది. అయితే, 19వ శతాబ్దంలో నౌకల ద్వారా ప్రమాదవశాత్తు ఇక్కడికి చేరిన ఎలుకలు... సహజ సిద్ధమైన శత్రువులు లేకపోవడంతో విపరీతంగా వృద్ధి చెందాయి. ప్రస్తుతం వాటి సంఖ్య పది లక్షలు దాటి ఉండవచ్చని అంచనా. ఈ ఎలుకలు పక్షుల గూళ్లపై దాడి చేస్తూ పిల్లలనే కాకుండా, పెద్ద పక్షులను సైతం పొట్టనబెట్టుకుంటున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా ఎలుకల సంతానోత్పత్తి సామర్థ్యం పెరగడం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేసిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

'మౌస్-ఫ్రీ మారియన్' పేరుతో బర్డ్‌లైఫ్ సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా పర్యావరణ విభాగం సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. దీనికి సంబంధించి ఇటీవల ఒక స్విస్ ఫౌండేషన్ 10 మిలియన్ డాలర్ల భారీ విరాళాన్ని ప్రకటించడంతో, ప్రాజెక్టుకు అవసరమైన నిధుల్లో 60 శాతం సమకూరినట్లయింది. ప్రణాళికాబద్ధంగా 2027లో ప్రయోగాత్మక తనిఖీలు నిర్వహించి, ఆపై 2028 లేదా 2029లో పూర్తిస్థాయిలో ఈ ఆపరేషన్ చేపట్టనున్నారు. పర్యావరణానికి కనీస నష్టం ఉండేలా కలిగించేలా ప్రత్యేకంగా రూపొందించిన విషపు ఎరను జీపీఎస్ సాంకేతికతతో హెలికాప్టర్ల ద్వారా ద్వీపమంతటా వెదజల్లనున్నారు. తక్షణ చర్యలు తీసుకోని పక్షంలో, ఈ ద్వీపంలోని 29 పక్షి జాతులలో 19 జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Advertisement
Marion Island
Mouse Free Marion
Seabird conservation
Invasive mice eradication
BirdLife South Africa

More Telugu News