29 గ్రామాల ప్రతినిధులతో ప్రత్యేక కమిటీ... అమరావతి రైతు జేఏసీ కీలక నిర్ణయం

Amaravati Farmer JAC decides to form special committee with representatives from 29 villages
  • ప్రభుత్వం, సీఆర్డీఏ అధికారులకు తగిన సూచనలు ఇచ్చేందుకు రైతు జేఏసీ కీలక నిర్ణయం
  • కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం విడివిడిగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారన్న జేఏసీ
  • గతంలో జేఏసీలకు సరైన కమిటీలు లేవని వ్యాఖ్య

రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం, సీఆర్డీఏ అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు అమరావతి ‘రైతు జేఏసీ’ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి పరిధిలోని మొత్తం 29 గ్రామాల ప్రతినిధులతో ఒక ప్రత్యేక అభివృద్ధి కమిటీని త్వరలోనే ఏర్పాటు చేయాలని జేఏసీ నేతలు తీర్మానించారు.


ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విడివిడిగా సీఆర్డీఏ అధికారుల చుట్టూ తిరుగుతున్నారని, దీనివల్ల అసలైన రైతుల ఉమ్మడి సమస్యలు పక్కదారి పడుతున్నాయని జేఏసీ అభిప్రాయపడింది. అందుకే అందరి తరఫున మాట్లాడేలా ఒక అధికారిక కమిటీని తేవాలని నిర్ణయించింది.


రాజధాని నిర్మాణం కోసం తాము ఎప్పుడో భూములు ఇచ్చినప్పటికీ... క్షేత్రస్థాయిలో రైతులకు సంబంధించిన అనేక సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పాటయ్యే అభివృద్ధి కమిటీ ద్వారా ఈ సమస్యలన్నింటినీ నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంత అభివృద్ధి అనేది కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా 29 గ్రామాల్లోనూ సమానంగా విస్తరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 


"గతంలోనూ జేఏసీలు ఏర్పాటు చేశారు కానీ, వాటిలో సరైన కమిటీ వివరాలు లేవు. ఇప్పుడు ఎవరికి వారే తామే నాయకులమనే తీరుగా వ్యవహరిస్తున్నారు. అలా కాకుండా, కొత్త కమిటీలో ప్రతి గ్రామం నుంచి అన్ని కులాల వారికి సమాన ప్రాధాన్యత ఇస్తాం" అని రైతు జేఏసీ నేతలు వెల్లడించారు.

Advertisement
Amaravati Farmer JAC
Amaravati Capital Development
CRDA Andhra Pradesh
Amaravati Farmers Issues
Andhra Pradesh Capital City
Amaravati Development Committee

More Telugu News