కొత్త విమానాన్ని వదిలేసి పాత ఎయిర్ ఫోర్స్ వన్‌లో ట్రంప్ ప్రయాణం.. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

Donald Trump travels in old Air Force One instead of new plane here is the secret
  • నాటో సదస్సు ముగిశాక పాత ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ తిరుగుప్రయాణం  
  • ఖతార్ బహుమతిగా ఇచ్చిన సరికొత్త బోయింగ్ 747 విమాన భద్రతపై పెరుగుతున్న అనుమానాలు  
  • ఇరాన్ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలోనే విమానం మార్చినట్లు రక్షణ నిపుణుల అంచనా
  • కొత్త విమానంలో క్షిపణి గుర్తింపు, రక్షణ వ్యవస్థలు లేవని వెల్లడి
  • బ్రిటన్ సైనిక స్థావరంలో కొత్త విమానాన్ని పరిశీలించిన అమెరికా సైనికులు  
టర్కీలో జరిగిన నాటో సదస్సు ముగిసిన తర్వాత స్వదేశానికి తిరుగుప్రయాణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఖతార్ ప్రభుత్వం బహుమతిగా ఇవ్వగా, అమెరికా ప్రభుత్వం సుమారు 400 మిలియన్ డాలర్లు ఖర్చు చేసి ఆధునికీకరించిన సరికొత్త 'బోయింగ్ 747' విమానాన్ని వదిలేసి, ఆయన తన పాత 'ఎయిర్ ఫోర్స్ వన్' విమానంలో ప్రయాణించారు. అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ క్షిపణి దాడులు ముదిరిన తరుణంలో, చివరి నిమిషంలో జరిగిన ఈ మార్పు కొత్త విమాన భద్రతపై అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది.  

ఈ విమానం మార్పుపై డొనాల్డ్ ట్రంప్ నేరుగా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కేవలం "పాత జ్ఞాపకాల కోసం" తాను పాత విమానంలో వెళ్తున్నానని, బ్రిటన్‌లోని రాయల్ ఎయిర్ ఫోర్స్ మిల్డెన్‌హాల్ సైనిక స్థావరంలో అమెరికా సైనికులు వీక్షించడం కోసమే కొత్త విమానాన్ని ముందే అక్కడికి పంపినట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అయితే, భద్రతా కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారా అని విలేకరులు ప్రశ్నించగా.. ఇరాన్ హిట్ లిస్టులో తానే మొదటి స్థానంలో ఉన్నానని వ్యాఖ్యానించారు. టర్కీ నుంచి విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే దాని ట్రాన్స్పాండర్ (రాడార్ సిగ్నల్స్) నిలిపివేయడం గమనార్హం. ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల పరిధి టర్కీ వరకు ఉన్నందునే ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్ చేరుకున్నాక విలేకరులను కిటికీల తెరలు మూసేయాలని ఆదేశించడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అత్యవసరంగా సేవల్లోకి తెచ్చిన ఈ కొత్త ఖతార్ విమానంలో పాత ఎయిర్ ఫోర్స్ వన్ తరహా క్షిపణి గుర్తింపు వ్యవస్థలు, తగినన్ని కమ్యూనికేషన్ యాంటెన్నాలు లేవు. కాలపరిమితి తక్కువగా ఉండటం వల్ల కొన్ని సంక్లిష్టమైన ఇంజనీరింగ్ మార్పులను పక్కనబెట్టినట్లు అమెరికా వైమానిక దళం గతంలోనే అంగీకరించింది. వైట్ హౌస్ ప్రతినిధి స్టీవెన్ చాంగ్ మాట్లాడుతూ.. కొత్త విమానంలో అత్యున్నత భద్రతా ప్రమాణాలు ఉన్నాయని చెప్తూనే, అధ్యక్షుడి రక్షణ కోసం వ్యూహాత్మక దిశమార్పులో భాగంగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.  
Advertisement
Donald Trump
Air Force One
Boeing 747
US Iran tensions
Presidential flight security
NATO summit Turkey

More Telugu News