ఆ చిరునవ్వు ఎప్పటికీ మరువలేను: నిరంజన్ మృతిపై పవన్ కల్యాణ్ భావోద్వేగం

Pawan Kalyan emotional over Niranjan death says will never forget that smile
  • అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతూ చిన్నారి నిరంజన్ మృతి
  • గత నెలలోనే హనుమకొండకు వెళ్లి నిరంజన్‌ను పరామర్శించిన పవన్
  • చిన్నారి మనల్ని విడిచి వెళ్లడం జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన

జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని, తెలంగాణలోని హనుమకొండకు చెందిన పొనుగంటి నిరంజన్ (17) అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతూ నిన్న రాత్రి కన్నుమూశాడు. ఈ వార్త తెలియగానే పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సోషల్ మీడియా వేదికగా నిరంజన్‌ను గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగాన్ని ఆయన వ్యక్తం చేశారు.


"నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది. కొద్దిరోజుల క్రితమే హనుమకొండలో వాళ్ల ఇంటికి వెళ్లి కలిసిన క్షణాలు ఇంకా నా కళ్లముందే కదలాడుతున్నాయి. అంతటి భయంకరమైన అనారోగ్యంతో పోరాడుతూ కూడా నన్ను చూడగానే ఆ చిన్నారి ముఖంలో విరిసిన చిరునవ్వు ఎప్పటికీ మరువలేని జ్ఞాపకం. శరీరం వ్యాధితో క్షీణిస్తున్నా... మనసు నిండా కొండంత ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉన్నాయి. అంతటి ధైర్యశాలి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం జీర్ణించుకోలేకపోతున్నా. ఆ చిన్నారి చూపిన ప్రేమ నా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది" అంటూ పవన్ భావోద్వేగానికి గురయ్యారు.


గత నెలలోనే నిరంజన్ అనారోగ్యం గురించి తెలుసుకున్న పవన్ కల్యాణ్ స్వయంగా హనుమకొండ వెళ్లి అతడిని పరామర్శించారు. ఆ సమయంలో నిరంజన్‌ను గుండెలకు హత్తుకుని, తిరుమల ప్రసాదం ఇచ్చి, సెల్ఫీ కూడా దిగారు. తనకు ఒక కుక్కపిల్ల కావాలని అడగ్గానే... ఆ రోజే కుక్కపిల్లను పంపించారు. అంతేకాదు, "నేను 'ఓజీ 2' తీస్తే అందులో నువ్వే నా స్పెషల్ గెస్ట్.. ఇద్దరం కలిసి సినిమా చూద్దాం" అని పవన్ మాట ఇచ్చారు. కానీ, ఈ లోపే చిన్నారి అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ఫ్యాన్స్ ఆవేదనకు గురవుతున్నారు. మరోవైపు, బాలీవుడ్ రియల్ హీరో సోనూ సూద్ సైతం నిరంజన్ కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి పరామర్శించారు. ఆ కుటుంబానికి తానున్నానంటూ కొండంత ధైర్యాన్ని అందించారు.

Advertisement
Pawan Kalyan
Ponuganti Niranjan
Janasena
Hanumakonda
Sonu Sood
OG 2

More Telugu News