మలయాళ స్టార్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి పార్వతి తిరువోతు
- మలయాళ హీరోలను దేవుళ్లలా పూజించే సంస్కృతి ఉందన్న పార్వతి
- హీరోల తప్పులను ఎత్తి చూపడం చాలా కష్టమని వ్యాఖ్య
- కొత్తవారిపై అధికారాన్ని చెలాయిస్తున్నారని మండిపాటు
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, హీరోయిన్ పార్వతి తిరువోతు జంటగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ఐనోబడీ’. నిస్సాం బషీర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ బ్యాంక్ ఉద్యోగి రాజీవన్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మలయాళంలో ఈ నెల 9న, తెలుగులో 10న థియేటర్లలో విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నటి పార్వతి మలయాళ చిత్ర పరిశ్రమలోని ప్రస్తుత పరిస్థితులపై, హీరోల చుట్టూ అలుముకున్న కల్చర్‌పై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
గడిచిన ఎనిమిది, తొమ్మిదేళ్లలో మలయాళ సినీ పరిశ్రమలో కొన్ని మార్పులు వచ్చిన మాట వాస్తవమే అయినా... అవన్నీ మనస్ఫూర్తిగా వచ్చినవి కావని పార్వతి కుండబద్దలు కొట్టారు. కేవలం ప్రజల నుంచి వచ్చిన విమర్శలు, మీడియా నిరంతరం చూపించిన శ్రద్ధ వల్లే ఇండస్ట్రీలో ఆ మార్పులు జరిగాయని ఆమె అభిప్రాయపడ్డారు. మలయాళ చిత్రసీమలో స్టార్ హీరోలను పూజించే సంస్కృతి అలాగే కొనసాగుతోందని, ఇక్కడి సూపర్‌స్టార్లను దేవుళ్లలా పూజించడం వల్లే వారి తప్పులను ఎత్తిచూపడం ఎవరికైనా చాలా కష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి పరిస్థితులు ఉండటం వల్లే ఇండస్ట్రీలో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తులు, కొత్తగా వచ్చే వారిపై తమ అధికారాన్ని చాలా సులభంగా చెలాయిస్తున్నారని ఆమె మండిపడ్డారు. పలుకుబడి ఉన్నవారు కొత్తవారి టాలెంట్‌ను తొక్కేస్తూ, వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సినిమా రంగంలో సానుకూల మార్పులు చాలా నెమ్మదిగా సాగుతుండటం తనకు ఎంతో నిరాశ కలిగిస్తోందని... అయినప్పటికీ ఇండస్ట్రీలో మహిళల హక్కుల కోసం, పని చేసేందుకు అనువైన మంచి వాతావరణం కోసం తమ మహిళా సంఘం చేస్తున్న పోరాటాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపేది లేదని పార్వతి స్పష్టం చేశారు.