‘నేనెవరో నీకు తెలియదు’.. ఫుట్‌బాల్‌ స్టార్‌ ఎంబాపేకు పరాగ్వే సెనెటర్‌ వార్నింగ్‌

Kylian Mbappe faces legal threat from Paraguay Senator Celeste Amarilla
  • క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్న అమరిల్లా
  • ఎంబాపేపై సెనెటర్‌ జాత్యహంకార వ్యాఖ్యలతో మొదలైన వివాదం
  • ‘‘కాలనీల ప్రభావంలో ఉన్న కామెరూనియన్‌’’ అంటూ అమరిల్లా పోస్టు
  • పదవికి అనర్హురాలంటూ ఎంబాపే కౌంటర్‌ విమర్శ
  • తన పోస్టు తొలగించినట్లు అమరిల్లా వెల్లడి
  • ఎంబాపే కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌
‘‘నువ్వు ఎవరో నాకు తెలుసు.. కానీ నేనెవరో నీకు తెలియదు. నన్ను కించపరిచే హక్కు నీకు లేదు. వెంటనే క్షమాపణ చెప్పు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటా’’ ఫ్రాన్స్‌ స్టార్‌ ఫుట్‌బాలర్‌ ఎంబాప్పేకు పరాగ్వే సెనేటర్‌ సెలెస్టే అమరిల్లా చేసిన ఈ హెచ్చరిక ఇప్పుడు చర్చనీయాంశమైంది. తనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు.

ఈ వివాదం అమరిల్లా చేసిన సోషల్‌ మీడియా పోస్టుతో మొదలైంది. ఎంబాప్పేను ‘‘కాలనీల ప్రభావంలో ఉన్న కామెరూనియన్‌. ఫ్రెంచ్‌లా కనిపించేందుకు బాగా ప్రయత్నిస్తున్నాడు’’ అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు, అతణ్ని అహంకారి, ఒక్కసారిగా డబ్బు వచ్చిపడ్డ అందవిహీనుడు’’ అంటూ వ్యక్తిగత విమర్శలు చేశారు. ఫ్రాన్స్‌ అదృష్టవశాత్తూ గెలిచిందని, మ్యాచ్‌లో ఎంబాపే భయపడిపోయాడని కూడా విమర్శించారు. దీనిపై స్పందించిన అతడు అమరిల్లాను ‘‘ఆ పదవికి అనర్హురాలు.. అసహ్యకరమైన మహిళ’’ అంటూ తీవ్రంగా విమర్శించాడు.

దీంతో మరోసారి స్పందించిన అమరిల్లా తనకు ఫ్రాన్స్‌పై ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. చిన్నప్పటి నుంచే ఫ్రెంచ్‌ పాఠశాలలో చదివానని, ఆ దేశాన్ని ఎంతో గౌరవిస్తానని చెప్పారు. తన అభ్యంతరం ఎంబాపే ప్రవర్తనపైనే తప్ప ఫ్రాన్స్‌పై కాదన్నారు. ప్రపంచకప్‌ మ్యాచ్‌కు ముందు పరాగ్వే జట్టును తక్కువ చేసి మాట్లాడటమే కాకుండా మ్యాచ్‌ సమయంలో ఆటగాళ్లను అగౌరవపరిచాడని ఆరోపించారు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత తమ గోల్‌కీపర్‌తో కూడా మర్యాదగా వ్యవహరించలేదని విమర్శించారు.

తొలుత కోపంతో ఆ పోస్టు పెట్టానని, తర్వాత అందులోని జాత్యహంకార వ్యాఖ్యలు తప్పని గుర్తించి వెంటనే తొలగించానని అమరిల్లా వెల్లడించారు. అయితే తనను ‘‘అసహ్యకరమైన మహిళ. పదవికి అనర్హురాలు’’ అని సంబోధించిన ఎంబాపే కూడా ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తాను ప్రజలు ఎన్నుకున్న సెనెటర్‌నని, తనను అవమానించడం మహిళలపై రాజకీయ హింస కిందకే వస్తుందని పేర్కొన్నారు. క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తానని హెచ్చరించారు.
Advertisement
Kylian Mbappe
Celeste Amarilla
Paraguay Senator
Football controversy
France Football
Legal Action

More Telugu News