చంద్రబాబు దంపతుల ఆశీస్సులతో.. వైరల్ అవుతున్న బండ్ల గణేశ్‌ కుమార్తె పెళ్లి పత్రిక

Bandla Ganesh daughter wedding card goes viral with Chandrababu Naidu blessings
  • ఆగస్టు 16న బండ్ల గణేశ్‌ కుమార్తె జనని వివాహం   
  • ఆహ్వాన పత్రికపై చంద్రబాబు, భువనేశ్వరి పేర్లు ముద్రించడంపై చర్చ
  • పవన్ అభిమాని అయిన బండ్ల ఇలా చేయడంపై సోషల్ మీడియాలో ప్రశ్నలు
  • నారా కుటుంబంతో ఉన్న బంధమే దీనికి కారణమంటున్న మరికొందరు
సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన కుమార్తె జనని వివాహం త్వరలో జరగనుండగా, ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ పత్రికపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి పేర్లు ఉండటమే ఈ చర్చకు దారితీసింది.

బండ్ల గణేశ్‌ కుమార్తె జననికి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్య తేజతో ఆగస్టు 16న హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో వివాహం జరగనుంది. ఉదయం 11:58 గంటలకు శుభ ముహూర్తం నిర్ణయించారు. ఇప్పటికే నిశ్చితార్థం ఘనంగా నిర్వహించిన బండ్ల గణేశ్‌, ప్రస్తుతం సినీ, రాజకీయ ప్రముఖులను స్వయంగా ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి పత్రికను తిరుమల శ్రీవారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకోగా, రెండో పత్రికను నారా భువనేశ్వరికి అందించారు.

అయితే, వివాహ ఆహ్వాన పత్రికపై "శ్రీమతి నారా భువనేశ్వరి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో" అని ప్రత్యేకంగా ముద్రించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ కార్డు ఫొటోలు వైరల్ కావడంతో నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బండ్ల గణేశ్‌ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఎంత పెద్ద అభిమానో అందరికీ తెలిసిందే. అనేక వేదికలపై పవన్‌ను 'దేవుడు' అని అభివర్ణించే ఆయన, తన కుమార్తె పెళ్లి పత్రికలో చంద్రబాబు దంపతుల పేర్లను ముద్రించడంపై కొందరు పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

మరోవైపు బండ్ల గణేశ్‌కు నారా కుటుంబంతో చాలాకాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆ అభిమానంతోనే వారి పేర్లను ముద్రించారని పలువురు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు జైలు నుంచి విడుదలై తిరిగి సీఎం కావాలని మొక్కుకొని, అది నెరవేరడంతో హైదరాబాద్ నుంచి తిరుమలకు పాదయాత్ర చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 

అలాగే, నారా భువనేశ్వరి పుట్టినరోజున ఓ నిరుపేద బాలుడి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన కుమార్తె పెళ్లి కార్డుపై వారి పేర్లను గౌరవ సూచకంగా ముద్రించి ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాహ పత్రిక సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
Advertisement
Bandla Ganesh
Janani Wedding
Chandrababu Naidu
Nara Bhuvaneswari
Bandla Ganesh Daughter Marriage
Hyderabad JRC Convention

More Telugu News