ఏపీ తరఫున మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు హైదరాబాదీ ఫసిహా నౌమన్

Fasiha Nauman to represent Andhra Pradesh in Miss Universe India 2026
  • తల్లయిన కొద్ది నెలలకే తిరిగి పోటీల్లోకి వచ్చిన ఫసిహా
  • మిస్ యూనివర్స్ ఇండియా 2026 జాతీయ పోటీలకు ఎంపిక
  • ఎనిమిదేళ్ల విరామం తర్వాత అందాల పోటీల్లోకి తిరిగి ప్రవేశం
  • మిస్ యూనివర్స్ నిబంధనల మార్పుతో దక్కిన అవకాశం
హైదరాబాద్‌కు చెందిన మోడల్, ఇన్‌ఫ్లుయెన్సర్ ఫసిహా నౌమన్ ప్రతిష్ఠాత్మక 'మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ 2026' కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. తల్లి అయిన కొద్ది నెలలకే ఆమె ఈ ఘనత సాధించడం విశేషం. ఈ విజయంతో ఆమె ఈ నెలలో నిర్వహించనున్న 'మిస్ యూనివర్స్ ఇండియా 2026' జాతీయ స్థాయి పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. సుమారు ఎనిమిదేళ్ల విరామం తర్వాత అందాల పోటీల బరిలోకి దిగిన ఆమె, అద్భుత విజయన్ని అందుకున్నారు.

వివాహితులు, తల్లులు సైతం అందాల పోటీల్లో పాల్గొనవచ్చని మిస్ యూనివర్స్ సంస్థ నిబంధనలను సవరించడం ఫసిహాకు తన కలను సాకారం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. మిస్ యూనివర్స్ ఇండియా 2026 పోటీలు జులై 19 నుంచి ఆగస్టు 23 వరకు జరగనుండగా, ఢిల్లీలో గ్రాండ్ ఫినాలే నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో విజేతగా నిలిచిన వారు నవంబర్‌లో ప్యూర్టోరికోలో జరగబోయే 75వ మిస్ యూనివర్స్ పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొంటారు.

ఫసిహా 2018లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ పోటీల్లో టాప్-10 ఫైనలిస్ట్‌లలో ఒకరిగా నిలిచారు. అనంతరం ఎంబీఏ పూర్తి చేసిన ఆమె, సబ్యసాచి ముఖర్జీ వంటి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన డిజైనర్ల వద్ద మోడల్‌గా పనిచేశారు. వివాహమై, బిడ్డకు జన్మనిచ్చిన మూడు నెలలకే తిరిగి పోటీలకు సిద్ధమవడం ఆమె అంకితభావానికి, పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తోంది.

"నా కుమారుడిని చూసిన ప్రతిసారీ, నేను ఈ ప్రయాణాన్ని ఎందుకు ప్రారంభించానో గుర్తుకు వస్తుంటుంది. పట్టుదల ఉంటే వృత్తిపరమైన లక్ష్యాలను, కుటుంబాన్ని సమతుల్యం చేసుకోవడం సాధ్యమేనని నా బిడ్డ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను" అని ఫసిహా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

ప్రస్తుతం ఆమె జాతీయ స్థాయి పోటీల కోసం కమ్యూనికేషన్, ఫిట్‌నెస్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. తన అనుభవం, పరిణితితో పోటీల్లో ప్రత్యేకతను చాటుకోవాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే 'ప్రాజెక్ట్ ఉడాన్' ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి, వారి ఆర్థిక స్వావలంబన కోసం ఆమె కృషి చేస్తున్నారు.
Fasiha Nauman
Miss Universe Andhra Pradesh 2026
Miss Universe India 2026
Hyderabad model

More Telugu News