గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026: భారత్‌కు గట్టి షాక్.. పడిపోయిన పాస్‌పోర్ట్ ర్యాంక్!

Global Passport Index 2026 Shocking decline in India passport rank
  • గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ ర్యాంక్
  • కేవలం 26 దేశాలకే వీసా రహిత ప్రవేశం
  • చైనా కంటే భారత్ వెనుకబాటు
  • పాకిస్థాన్, బంగ్లాదేశ్ కంటే మెరుగైన స్థితి
  • టాప్-10లో ఐరోపా దేశాల ఆధిపత్యం
అంతర్జాతీయ ప్రయాణ సౌలభ్యం, పాస్‌పోర్ట్ బలాన్ని అంచనా వేసే 'గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026'లో భారతదేశానికి నిరాశ ఎదురైంది. తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ 125వ స్థానానికి పడిపోయింది. గత ఏడాది స్వల్ప పురోగతితో టాప్ 100 వైపు అడుగులు వేసినప్పటికీ, ఈసారి మళ్లీ వెనకడుగు వేసింది. 2021 నుండి 2023 వరకు 127వ స్థానంలో ఉన్న భారత్, 2025 నాటికి 124వ స్థానానికి ఎగబాకింది. అయితే ఇప్పుడు మరో స్థానాన్ని కోల్పోయి 125వ ర్యాంకుకు పరిమితమైంది. ప్రస్తుతం భారత పాస్‌పోర్ట్ కలిగి ఉన్నవారికి ప్రపంచవ్యాప్తంగా కేవలం 26 గమ్యస్థానాలకు మాత్రమే వీసా రహిత ప్రవేశం లభిస్తోంది.

ప్రస్తుత ర్యాంకింగ్స్ ప్రకారం నమీబియా, ఫిలిప్పీన్స్, మొరాకో, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాల కంటే భారత పాస్‌పోర్ట్ వెనుకబడి ఉంది. అయితే అజర్‌బైజాన్, కిర్గిజిస్థాన్ దేశాల కంటే మెరుగైన స్థానంలో నిలిచింది. భారత పాస్‌పోర్ట్ కలిగినవారు  భూటాన్, నేపాల్, జమైకా, మకావు, పాలస్తీనా, ట్యునీషియా, అంగోలా, బార్బడోస్ వంటి దేశాలకు వీసా లేకుండా లేదా వీసా ఆన్ అరైవల్ ద్వారా ప్రయాణించవచ్చు. కానీ అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, చైనా, యూఏఈ సహా దాదాపు 88 దేశాల్లోకి ప్రవేశించడానికి భారతీయులకు ఇప్పటికీ ముందస్తు వీసా తప్పనిసరిగా ఉంది.

భారత్ పొరుగు దేశాల విషయానికి వస్తే.. చైనా 104వ స్థానంతో భారత్ (125) కంటే చాలా మెరుగైన ర్యాంకులో నిలిచింది. అయినప్పటికీ, మిగిలిన దక్షిణాసియా దేశాలతో పోలిస్తే భారత్ స్థానం మెరుగ్గానే ఉంది. ఈ ఇండెక్స్‌లో బంగ్లాదేశ్ 166వ స్థానంలో, నేపాల్ 164వ స్థానంలో ఉండగా.. పాకిస్థాన్ అత్యంత దిగువన 188వ ర్యాంకులో నిలిచింది. గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026లో అగ్రస్థానాలన్నీ యూరప్ దేశాలే ఆక్రమించాయి. ఈ జాబితాలో స్వీడన్ మొదటి స్థానంలో నిలవగా, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, జర్మనీ తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి. అమెరికా, ఫ్రాన్స్ దేశాలు కొద్దిలో టాప్-10 అవకాశాన్ని కోల్పోయి 11వ స్థానంలో నిలవగా, కెనడా 13వ స్థానాన్ని సాధించింది.
Global Passport Index
Indian Passport Rank 2026
Visa Free Travel Destinations
Sweden Passport Ranking
Global Mobility Report
Indian Passport Power

More Telugu News