ఖమేనీ అంత్యక్రియల్లో ప్రతీకార జ్వాలలు.. ట్రంప్, నెతన్యాహులను చంపాలంటూ లక్షలాది మంది నినాదాలు!
- మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు
- ట్రంప్, నెతన్యాహులను హతమార్చాలంటూ పిలుపు
- ఇరాన్ అగ్రనేతల ఉమ్మడి బహిరంగ ప్రదర్శన
- మొజ్తబా ఖమేనీ గైర్హాజరు, ఇజ్రాయెల్ బెదిరింపులు
ఈ అంత్యక్రియల ప్రార్థనలు రాజకీయ రంగును సంతరించుకున్నాయి. లక్షలాది మంది ప్రజలు తెల్లవారుజామునే ప్రార్థనా స్థలానికి చేరుకుని, ఇరాన్ జాతీయ జెండాలతో పాటు ప్రతికారానికి ప్రతీకగా భావించే ఎరుపు రంగు జెండాలను ప్రదర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులను హతమార్చాలంటూ రాసిన పోస్టర్లు, గ్రాఫిటీలు అక్కడ భారీగా వెలిశాయి. ఈ సందర్భంగా వేదికపై ఉన్న కవి మహ్మద్ రసూలీ మైకులో మాట్లాడుతూ.. "ఇకపై కఫనమే మా వస్త్రం. ట్రంప్‌ను చంపడం మా బాధ్యత" అని పిలుపునిచ్చారు. ప్రార్థనలకు వచ్చిన ఘోలామ్రేజా సాబూని అనే పౌరుడు కూడా, మా ఇమామ్‌ను చంపిన ట్రంప్‌ను చంపాల్సిందేనని పేర్కొన్నాడు. మరోవైపు అర్మేనియాలో ఇరాన్ రాయబారి ఖలీల్ షిర్‌ఘోలామి స్పందిస్తూ.. "మీరు మనుషులను చంపగలరు కానీ ఆదర్శాలను కాదు, అయాతొల్లా ఖమేనీని చంపి మీరు పరిమళాల సీసాను పగలగొట్టారు, ఆ సువాసన ఇప్పుడు అంతటా వ్యాపించింది" అని ఎక్స్‌లో రాశారు.
ఇజ్రాయెల్ నుంచి ప్రాణాపాయ బెదిరింపులు ఉన్నప్పటికీ ఇరాన్ అగ్రనేతలు ఈ వేడుకకు హాజరై తమ ఐక్యతను చాటారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాగెర్ ఖలీబాఫ్, కుద్స్ ఫోర్స్ అధిపతి ఇస్మాయిల్ ఖానీ, రివల్యూషనరీ గార్డ్ హెడ్ జనరల్ అహ్మద్ వాహిదీలతో పాటు ఖమేనీ కుమారులు మసౌద్, మేసమ్, ముస్తఫాలు చాలా కాలం తర్వాత ఇక్కడ కనిపించారు. అయితే, దాడిలో గాయపడి అజ్ఞాతంలో ఉన్నట్లు భావిస్తున్న కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. ఇజ్రాయెల్ గతంలో బహిరంగ కార్యక్రమాలను బట్టి నేతల లోకేషన్లు కనిపెట్టి దాడులు చేసిన దాఖలాలు ఉండటమే దీనికి కారణం.
97 ఏళ్ల షియా మతగురువు అయాతొల్లా జాఫర్ శోభాని ఈ ప్రార్థనలను నడిపించారు. ఖమేనీతో పాటు ఆయన కోడలు జహ్రా హద్దాద్ అడెల్, 14 నెలల మనవరాలు జహ్రా మొహమ్మది గొల్పాయిగాని శవపేటికలను కూడా అక్కడ ఉంచారు. ఖమేనీ పార్థివ దేహాన్ని ఇరాన్, ఇరాక్‌లోని వివిధ నగరాల్లో తిప్పిన తర్వాత, గురువారం ఆయన జన్మస్థలమైన మషాద్‌లోని ఇమామ్ రెజా బలిపీఠం వద్ద ఖననం చేయనున్నారు.