ఢిల్లీ గృహిణి దశ తిరిగింది.. అబుదాబి లాటరీలో రూ.65 కోట్ల జాక్‌పాట్!
- అబుదాబి బిగ్ టికెట్ డ్రాలో ఢిల్లీ మహిళకు జాక్‌పాట్
- గృహిణి కనికా అరోరాకు రూ.65 కోట్ల భారీ లాటరీ
- భార్య పేరు మీద భర్త ఆన్‌లైన్‌లో కొన్న టికెట్‌కు అదృష్టం
- నాలుగేళ్లుగా టికెట్లు కొంటున్న కుటుంబం
- కొత్త ఇల్లు, కూతురి భవిష్యత్తు కోసం డబ్బు వినియోగిస్తామని వెల్లడి
వివరాల్లోకి వెళ్తే.. కనికా భర్త గత నాలుగేళ్లుగా క్రమం తప్పకుండా ‘బిగ్ టికెట్’ డ్రాలో టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జూన్ 30న జరిగిన డ్రా కోసం తన భార్య కనికా పేరు మీద ఆన్‌లైన్‌లో 476107 నంబరు గల టికెట్‌ను ఆయన తీసుకున్నారు. అనూహ్యంగా ఈ టికెట్‌కే బంపర్ బహుమతి వరించడంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.
తాను రూ. 65 కోట్లు గెలిచానన్న వార్తను మొదట నమ్మలేకపోయానని కనికా అరోరా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సొమ్ముతో కొత్త ఇల్లు కొనుగోలు చేయడంతో పాటు, తమ ఐదేళ్ల కుమార్తె ఉన్నత చదువులు, భవిష్యత్తు అవసరాల కోసం కొంత మొత్తాన్ని కేటాయిస్తామని ఆమె తెలిపారు. అలాగే, ఎప్పటి నుంచో తమకున్న డిస్నీల్యాండ్ సందర్శన కలని కూడా ఈ నిధులతో నెరవేర్చుకుంటామని ఆ కుటుంబం సంతోషంగా వెల్లడించింది. యూఏఈలో నిర్వహించే ‘బిగ్ టికెట్’ డ్రాకు విశేష ఆదరణ ఉంది. ప్రతినెలా జరిగే ఈ లక్కీ డ్రాలో వేలాది మంది ప్రవాసులు పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు.