క్రికెట్‌లో భారీ మార్పులు: వన్డేల ఆయుష్షు తగ్గుతుందా?.. ఐసీసీ సంచలన ప్లాన్!

ICC major changes to cricket and future of ODI format
  • క్రికెట్ క్యాలెండర్‌లో సంచలన మార్పులు
  • వన్డేల నిడివి తగ్గింపు ప్రతిపాదన
  • సరికొత్త గ్లోబల్ టీ20 లీగ్
  • డబ్ల్యూటీసీలోకి మూడు కొత్త జట్లు
  • ఎడిన్‌బరో ఐసీసీ సమావేశంలో చర్చ
అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తును కాపాడేందుకు, మూడు ఫార్మాట్లను గాడిలో పెట్టేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొన్ని విప్లవాత్మక మార్పులపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వన్డేల నిడివిని తగ్గించడం, సరికొత్త గ్లోబల్ టీ20 ఫ్రాంచైజీ పోటీలను ప్రవేశపెట్టడం, ఆసియా కప్ వంటి ఖండాల వారీ టోర్నమెంట్‌లను పెంచడం, మూడు ఫార్మాట్‌లకు ప్రత్యేక విండోలను కేటాయించడం వంటి కీలక ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ఐసీసీ నియమించిన అమెరికన్ కన్సల్టింగ్ సంస్థ 'మెకిన్సే' చేపట్టిన వ్యూహాత్మక సమీక్షలో భాగంగా ఈ వినూత్న ఆలోచనలు బయటకు వచ్చాయి. బుధవారం ఎడిన్‌బరోలో జరగనున్న ఐసీసీ వార్షిక సాధారణ సమావేశంలో 12 మంది పూర్తిస్థాయి సభ్యులు ఈ అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నప్పటికీ, నిజమైన గ్లోబల్ క్రీడగా మారడంలో సవాళ్లను ఎదుర్కొంటోంది. చిన్న దేశాల్లో క్రీడ విస్తరిస్తున్నా, వారి ఆర్థిక స్థిరత్వంపై నీలినీడలు ముసురుకున్నాయి. మరోవైపు, టీ20ల ధాటికి సంప్రదాయ టెస్టులు, వన్డే ఫార్మాట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లపై ప్రేక్షకులు ఆసక్తి చూపకపోవడంతో, టీ20ల వృద్ధి వల్ల మొదటగా దెబ్బతినేది వన్డే ఫార్మాటేనని మెజారిటీ వాటాదారులు నమ్ముతున్నారు.

ఇదే విషయమై భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల మాట్లాడుతూ.. "క్రికెట్ గ్లోబల్ క్రీడగా మారాలన్నా, ఒలింపిక్స్‌లో చేరాలన్నా ఆట నిడివి ఎంత తక్కువగా ఉంటే అంత మేలు. టీ20 క్రికెట్ స్థిరంగా కొనసాగుతుంది కానీ, వన్డేల భవిష్యత్తుపై నాకు నమ్మకం లేదు" అని వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో 50 ఓవర్ల ప్రపంచకప్‌నకు కేవలం 18 నెలల ముందు మాత్రమే వన్డేలు ఆడేలా ఐసీసీ పరిమితులు విధించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.

దీంతో పాటు, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)ను 2027-2029 ఎడిషన్ నాటికి 12 జట్లకు విస్తరించాలని భావిస్తోంది. ఈ రేసులో ఐర్లాండ్, జింబాబ్వే, ఆఫ్ఘనిస్థాన్ జట్లు నిలిచాయి. అయితే, ప్రస్తుత ఐసీసీ సైకిల్ ముగిసే 2031 వరకు అమల్లో ఉన్న షెడ్యూల్స్ కారణంగా.. ఈ కొత్త మార్పులన్నీ ఆ తర్వాతే పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
ICC
ODI Cricket
Cricket Reforms
World Test Championship
T20 Franchise Cricket
International Cricket Schedule

More Telugu News