భారత్-ఇంగ్లండ్ మ్యాచ్‌లో కండోమ్ యాడ్.. బీసీసీఐపై కీర్తి ఆజాద్ ఆగ్రహం
- ఇండియా-ఇంగ్లండ్ టీ20 మ్యాచ్‌లో కండోమ్ యాడ్ రావడంపై కీర్తి ఆజాద్ అభ్యంతరం
- కుటుంబంతో కలిసి చూసే మ్యాచ్‌లలో ఇలాంటివి తగవని వ్యాఖ్య
- బీసీసీఐ వెంటనే ఈ విషయంపై దృష్టి పెట్టాలని డిమాండ్
- స్పందించకపోతే పార్లమెంటులో ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని హెచ్చరిక
- ఆల్కహాల్, సిగరెట్ యాడ్స్ నిషేధించినప్పుడు ఇవి ఎందుకని ప్రశ్న
ఈ అంశంపై ఐఏఎఎన్ఎస్ వార్తా సంస్థతో మాట్లాడుతూ, "ఇది ఒక అడల్ట్ యాడ్. పిల్లలు తమ తల్లిదండ్రులతో కలిసి మ్యాచ్ చూస్తుంటారు. వారి వయసు 16 ఏళ్ల లోపే ఉంటుంది. నేను చూస్తున్నప్పుడే 44 కోట్ల మంది ఈ మ్యాచ్‌ను వీక్షిస్తున్నారు. అలాంటి సమయంలో ఇలాంటి యాడ్ రావడం సరికాదు" అని ఆజాద్ అన్నారు. ఇలాంటి ప్రకటనల వల్ల తల్లిదండ్రులు ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటారని, పిల్లల నుంచి వచ్చే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియని గందరగోళం ఏర్పడుతుందని ఆయన వివరించారు.
ఆల్కహాల్, సిగరెట్ ఉత్పత్తుల ప్రకటనలను నిషేధించినప్పుడు, అడల్ట్ కంటెంట్ ఉన్న యాడ్స్‌ను ఎందుకు అనుమతిస్తున్నారని ఆయన బీసీసీఐని ప్రశ్నించారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో దీనిపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆజాద్.. "ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరుగుతున్న అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ను పిల్లలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. డ్యూరెక్స్ కండోమ్ కు సంబంధించిన అడల్ట్ యాడ్ స్క్రీన్‌పై రావడం సిగ్గుచేటు. బీసీసీఐ ఈ విషయాన్ని గమనించాలి" అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఈ విషయంపై బీసీసీఐ సరైన రీతిలో స్పందించకపోతే, అవసరమైతే పార్లమెంటులో కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని కీర్తి ఆజాద్ హెచ్చరించారు.