హాంకాంగ్ ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న తెలుగు ఫ్యామిలీ.. అండగా నిలిచిన మంత్రి లోకేశ్‌

Nara Lokesh supports Telugu family stranded at Hong Kong airport
  • పాస్‌పోర్టులు పోగొట్టుకుని హాంకాంగ్ విమానాశ్రయంలో చిక్కుకున్న తెలుగు ఫ్యామిలీ
  • తమను ఆదుకోవాలంటూ మంత్రి నారా లోకేశ్‌కు 'ఎక్స్‌'లో బాధితురాలి విజ్ఞప్తి
  • తక్షణం స్పందించి కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు సహాయం కోరిన లోకేశ్‌
  • హైదరాబాద్ నుంచి చికాగో వెళుతుండగా కాథే పసిఫిక్ విమానంలో ఘటన
  • ఐదు, మూడేళ్ల చిన్నారులతో 52 గంటలుగా ఎయిర్‌పోర్టులోనే ఎదురుచూపులు
పాస్‌పోర్టులు పోగొట్టుకుని హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ఒక తెలుగు కుటుంబానికి తక్షణమే సహాయం అందించాలని ఏపీ విద్య, మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను కోరారు. హైదరాబాద్ నుంచి చికాగో వెళుతున్న ఈ కుటుంబం, మార్గమధ్యంలో తమ పాస్‌పోర్టులు ఉన్న బ్యాగును పోగొట్టుకుని తీవ్ర ఇబ్బందులు పడుతోంది.

అస‌లేం జ‌రిగిందంటే..! 
రాజేశ్వరి బొల్లా అనే మహిళ తన కుటుంబంతో కలిసి ఈ నెల‌ 2న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కాథే పసిఫిక్ విమానంలో చికాగోకు బయలుదేరారు. హాంకాంగ్ మీదుగా వారి ప్రయాణం సాగుతుండగా, విమానంలో తమ పాస్‌పోర్టులు ఉన్న బ్యాగును పోగొట్టుకున్నారు. దీంతో గత 52 గంటలుగా వారు హాంకాంగ్ విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. తమతో పాటు ఐదు, మూడేళ్ల వయసున్న ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని, పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ క్రమంలో సహాయం కోసం మంత్రి నారా లోకేశ్‌ను ట్యాగ్ చేస్తూ 'ఎక్స్‌' వేదికగా ఆమె ఒక పోస్ట్ పెట్టారు. "మేము అత్యవసర పరిస్థితిలో ఉన్నాము. మాకు కొత్త పాస్‌పోర్టులు జారీ చేసేలా సరైన అధికారులతో మాట్లాడటానికి దయచేసి సహాయం చేయండి లేదా మార్గనిర్దేశం చేయండి" అని ఆమె తన పోస్టులో అభ్యర్థించారు.

రాజేశ్వరి విజ్ఞప్తిపై మంత్రి లోకేశ్ తక్షణమే స్పందించారు. వారి పరిస్థితి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ దృష్టికి తీసుకెళ్లారు. "ఈ విషయంలో దయచేసి జోక్యం చేసుకుని, ఆ కుటుంబానికి తక్షణ సహాయం అందించాలని కోరుతున్నాను" అని లోకేశ్‌ 'ఎక్స్‌'లో జైశంకర్‌ను అభ్యర్థించారు.

తమ బ్యాగులో రెండు భారతీయ పాస్‌పోర్టులతో పాటు రెండు అమెరికా పాస్‌పోర్టులు ఉన్నాయని రాజేశ్వరి తెలిపారు. జులై 2న తెల్లవారుజామున 2:43 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన 'సీఎక్స్‌ 672' విమానంలో ప్రయాణించిన వారు ఎవరైనా ఉంటే, తమ బ్యాగు గురించి ఏ చిన్న సమాచారం తెలిసినా అందించాలని ఆమె తోటి ప్రయాణికులను కోరారు. మంత్రి లోకేశ్‌ చొరవతో తమకు త్వరలోనే సహాయం అందుతుందని ఆ కుటుంబం ఆశిస్తోంది.
Nara Lokesh
Hong Kong Airport
S Jaishankar
Telugu family stranded
Lost passports
Rajeshwari Bolla

More Telugu News