అమెరికాలో రూ. 2.9 కోట్ల ఉద్యోగం కాదని.. తల్లిదండ్రుల కోసం కిరాణా దుకాణం నడుపుతున్న ఐఐటీ టాపర్!

Vivek Sharma IIT Bombay topper rejects 29 crore US job to run grocery store for parents
  • అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రుల కోసం కీలక నిర్ణయం
  • కాన్పూర్‌లో కిరాణా షాపు నడుపుతున్న వివేక్ శర్మ
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్ఫూర్తిదాయక కథ
ఐఐటీ బాంబేలో గోల్డ్ మెడల్ సాధించిన ఓ యువ ఇంజనీర్, ఏటా సుమారు రూ. 2.9 కోట్ల వేతనంతో లభించిన అమెరికా ఉద్యోగాన్ని కాదని, అనారోగ్యంతో ఉన్న తన తల్లిదండ్రుల సేవ కోసం స్వదేశంలోనే ఉండిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన వివేక్ శర్మ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అనేకమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

వివేక్ శర్మ ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్‌ విభాగంలో గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. అతడి తండ్రి రైల్వే ఉద్యోగి కాగా, తల్లి ట్యూషన్ టీచర్‌గా విధులు నిర్వహించేవారు. విద్యాభ్యాసంలో అసాధారణ ప్రతిభ కనబరిచిన వివేక్‌కు శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఓ స్టార్టప్ సంస్థ సుమారు 2.40 లక్షల డాలర్ల (దాదాపు రూ. 2.9 కోట్లు) వార్షిక వేతనంతో ఉద్యోగం అవకాశం కల్పించింది. వీసా ప్రక్రియతో పాటు ఇతర ఏర్పాట్లు సైతం తుది దశకు చేరుకున్నాయి.

అయితే, అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో వివేక్ తండ్రి గుండెపోటుకు గురికావడం, అదే సమయంలో తల్లి క్యాన్సర్‌ బారిన పడటంతో వివేక్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. కెరీర్ కంటే కుటుంబ బాధ్యతలే ముఖ్యమని భావించి, ఆ భారీ ఆఫర్‌ను తిరస్కరించాడు. వీసా ప్రక్రియను రద్దు చేసుకుని కాన్పూర్‌లోనే స్థిరపడ్డాడు. ప్రస్తుతం అక్కడ ఒక కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తూనే, నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కోడింగ్ పాఠాలను బోధిస్తున్నాడు.

లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే ఈ విషయాన్ని 'ఎక్స్' వేదికగా పంచుకోవడంతో వివేక్ స్ఫూర్తిదాయక ప్రయాణం వెలుగులోకి వచ్చింది. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు వేనోళ్ల ప్రశంసిస్తున్నారు. "నిజమైన గెలుపు సంపాదనలో కాదు, కుటుంబ విలువలలోనే ఉంటుంది" అంటూ వివేక్‌పై అభినందనల వర్షం కురిపిస్తున్నారు.
Vivek Sharma
IIT Bombay gold medalist
Kanpur grocery store
Rejected US job offer
Inspiring story parents

More Telugu News