నటనలో పర్ఫెక్షనిస్ట్.. ఆస్తుల సంపాదనలోనూ మాస్టర్.. ఆమిర్ ఖాన్ వేల కోట్ల సామ్రాజ్యంపై ఓ లుక్కేయండి!
- రూ.1862 కోట్లుగా ఆమిర్ ఖాన్ నికర ఆస్తుల విలువ
- త్వరలో మూడో పెళ్లికి సిద్ధమవుతున్న మిస్టర్ పర్ఫెక్షనిస్ట్
- ముంబై, పంచగనితో పాటు అమెరికాలోని బెవర్లీ హిల్స్‌లోనూ ఖరీదైన నివాసాలు
- రోల్స్ రాయిస్, బెంట్లీ సహా రూ.10 కోట్లకు పైగా విలువైన కార్ల కలెక్షన్
- తన పూర్వీకుల గ్రామంలో 22 ఇళ్లను కొనుగోలు చేసిన ఆమిర్
రూ.1,862 కోట్ల అధిపతి
బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి, ఐదు దశాబ్దాలుగా వినోద పరిశ్రమలో కొనసాగుతున్న ఆమిర్ ఖాన్ 50కి పైగా చిత్రాల్లో నటించారు. నటనతో పాటు 1999లో 'ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ (ఏకేపీ)' పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి విజయవంతమైన నిర్మాతగానూ నిలిచారు. ఫస్ట్‌పోస్ట్ నివేదిక ప్రకారం, 2024 జులై నాటికి ఆమిర్ నికర ఆస్తుల విలువ సుమారు రూ.1,862 కోట్లు.
ముంబై నుంచి అమెరికా వరకు ఆస్తులు
ఆమిర్ ఖాన్‌కు ముంబైలో పలు ఖరీదైన ఆస్తులు ఉన్నాయి. ఆయన పెళ్లి చేసుకోబోతున్న బాంద్రాలోని సముద్రానికి అభిముఖంగా ఉన్న 5,000 చదరపు అడుగుల ఇంటిని 2013లో రూ.60 కోట్లకు కొనుగోలు చేశారు. దీంతో పాటు ముంబైలోని హిల్ వ్యూ, బెల్లా విస్టా, మెరీనా అపార్ట్‌మెంట్లలోనూ ఆయనకు పలు ఫ్లాట్లు ఉన్నాయి.
కేవలం ముంబైకే పరిమితం కాకుండా హాలీవుడ్ తారలు నివసించే అమెరికాలోని బెవర్లీ హిల్స్‌లోనూ ఆమిర్ ఖాన్‌కు ఒక విలాసవంతమైన భవంతి ఉంది. దీని విలువ సుమారు రూ.75 కోట్లు. పుణె సమీపంలోని పంచగనిలో 2 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఫామ్‌హౌస్ కూడా ఆయన సొంతం. దీని విలువ సుమారు రూ.7 కోట్లు.
పూర్వీకుల గ్రామంతో అనుబంధం
ఇవే కాకుండా ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లా, షాహాబాద్‌లోని తన పూర్వీకుల గ్రామంలో ఆమిర్ ఖాన్ ఏకంగా 22 ఇళ్లను కొనుగోలు చేశారు. తన బంధువులు ఆ ఇళ్లను అమ్మాలనుకుంటున్నారని తెలిసి, తానే వాటిని కొన్నట్లు ఆయన గతంలో తెలిపారు. "ఇది నా పూర్వీకుల ఊరు కాబట్టి, భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం. ఎప్పటికైనా వ్యవసాయం చేయాలన్నది నా కోరిక. ఈ భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉంది" అని ఆమిర్ ఒక సందర్భంలో వివరించారు.
విలాసవంతమైన కార్ల కలెక్షన్
ఆమిర్ ఖాన్ గ్యారేజీలో అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. వాటిలో రూ.6.95 కోట్ల నుంచి రూ.7.95 కోట్ల మధ్య విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఒకటి. అంతేగాక సుమారు రూ.10.5 కోట్ల విలువైన ప్రత్యేకంగా కస్టమైజ్ చేయించుకున్న మెర్సిడెస్ బెంజ్ ఎస్600 కూడా ఆయన వద్ద ఉంది.
వీటితో పాటు బెంట్లీ కాంటినెంటల్, బీఎండబ్ల్యూ 6-సిరీస్, టయోటా వెల్‌ఫైర్, మహీంద్రా ఎక్స్‌యూవీ500 వంటి లగ్జరీ కార్లు కూడా ఆయన కలెక్షన్‌లో ఉన్నాయి. నటుడిగా, నిర్మాతగా దశాబ్దాల పాటు తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆమిర్ ఖాన్, పెట్టుబడుల విషయంలోనూ ముందుచూపుతో వ్యవహరించి భారీ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు.