భారత ఈ20 పెట్రోల్‌కు భూటాన్ నో.. కారణం ఇదే!
- సాధారణ పెట్రోల్‌నే కొనసాగించాలని భారత్‌ను కోరిన భూటాన్
- పాత భూగర్భ ఇంధన ట్యాంకులు ఈ20కు అనుకూలం కావని వివరణ
- ఇథనాల్ తేమను పీల్చుకోవడంతో ఇంధనం కలుషితమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన
- కొండ ప్రాంతాల్లో వాహనాల పనితీరుపై కూడా భూటాన్‌కు ఆందోళన
- భవిష్యత్తులో ఈ25 అమలుకు ముందే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి
భూటాన్‌లోని పాత భూగర్భ ఇంధన నిల్వ ట్యాంకులు ఈ20 పెట్రోల్‌కు అనుకూలంగా లేవని అక్కడి ప్రభుత్వం తెలిపింది. ఇథనాల్ తేమను సులభంగా పీల్చుకునే గుణం కలిగి ఉండటంతో ట్యాంకుల్లోకి నీరు చేరితే ఇంధనం కలుషితమయ్యే ప్రమాదం ఉందని వివరించింది. దీంతో వాహనాల పనితీరుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంది.
అంతేకాదు.. భూటాన్‌లో ఎక్కువ ప్రాంతాలు కొండలు, ఎత్తైన రహదారులతో ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో వాహనాలకు పూర్తి శక్తి అవసరమవుతుందని, ఈ20 పెట్రోల్ అదే స్థాయి పనితీరును అందిస్తుందో లేదో అన్న సందేహం కూడా అధికారుల్లో ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. భూటాన్ మరో విజ్ఞప్తి కూడా చేసింది. భవిష్యత్తులో భారత్ ఈ25 లేదా పూర్తిగా ఇథనాల్ ఆధారిత ఇంధనానికి మారితే ముందుగానే సమాచారం ఇవ్వాలని కోరింది
భూటాన్ తనకు అవసరమైన మొత్తం పెట్రోల్, డీజిల్‌ను భారత్ నుంచే దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం భారతీయ పెట్రోల్ బంకుల్లో లభించే ఇంధనం కాకుండా, ఎగుమతుల కోసం ఉత్పత్తి చేసే నాణ్యమైన ఇంధనాన్ని కొనుగోలు చేస్తోంది.
భారత్‌లో ఈ20 పెట్రోల్‌పై ఇప్పటికే చర్చ కొనసాగుతోంది. 2023కు ముందు తయారైన కొన్ని పెట్రోల్ వాహనాల యజమానులు మైలేజీ తగ్గడం, నిర్వహణ ఖర్చులు పెరగడం వంటి సమస్యలను ప్రస్తావిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం మైలేజీ కొంత తగ్గినా ఇంజిన్ పనితీరు, యాక్సిలరేషన్ మెరుగుపడతాయని చెబుతోంది.