నా కొడుకుని పోలీసులే చంపేశారు: మెజిస్టీరియల్ విచారణలో సాయికృష్ణ తల్లి
- సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక దశకు చేరుకున్న మెజిస్టీరియల్ విచారణ
- విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో విచారణకు హాజరైన తల్లి, మేనమామ, మేనత్త
- తన కుమారుడి మరణానికి కారణమైన వారికి శిక్ష పడేలా చూడాలన్న విజయలక్ష్మి
ఏపీలో సంచలనం సృష్టించిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మెజిస్టీరియల్ విచారణ కీలక దశకు చేరుకుంది. విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు జరిగిన విచారణకు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, మేనమామ నాగేశ్వరరావు, మేనత్త హాజరయ్యారు. సుమారు రెండు గంటలకు పైగా జరిగిన ఈ విచారణలో వారు అధికారుల ముందు తమ వాంగ్మూలాలను సమర్పించారు.
ఈ సందర్భంగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి పోలీసులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన కుమారుడు సాయికృష్ణను పోలీసులే దారుణంగా చంపేశారని... ఆ తర్వాత ఆధారాలు లేకుండా మృతదేహాన్ని మాయం చేశారని ఆమె ఆరోపించారు. సాయికృష్ణ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడని తెలియడంతో తాము అక్కడికి వెళ్లామని... అయితే అప్పటి సీఐ నాగరాజు తన కుమారుడిని చూడనివ్వకుండా అడ్డుకుని, అక్కడి నుంచి వెనక్కి పంపించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో పూర్తి నిజాలు వెలుగులోకి రావాలంటే సమగ్రమైన, నిష్పాక్షికమైన విచారణ జరగాలని... తన కుమారుడి మరణానికి కారణమైన వారికి శిక్ష పడేలా చూడాలని ఆమె విచారణాధికారిని వేడుకున్నారు.