రూ.5 కోట్ల ఫెరారీపై ఆడుకున్న చిన్నారులు.. తల్లిదండ్రులను కోర్టుకు లాగిన యజమాని!
- చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో ఘటన
- నలుగురు చిన్నారులు ఆడుకుంటూ ఫెరారీపై గీతలు గీసిన వైనం
- దెబ్బతిన్న పలు విడి భాగాలు
- మరమ్మతులకు రూ.95 లక్షల వరకు అవుతుందని అంచనా
- రూ.4.75 లక్షలు ఇవ్వడానికి ముందుకొచ్చిన తల్లిదండ్రులు
- రాజీ కుదరకపోవడంతో కోర్టుకెక్కిన యజమాని
యునాన్ ప్రావిన్స్‌లోని కున్మింగ్ నగరానికి చెందిన ఓ వ్యక్తి వ్యాపార పనుల కోసం బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాడు. తన ఎరుపు రంగు ఫెరారీ 488 GTB కారుపై గీతలు కనిపించాయి. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా 10 ఏళ్లలోపు నలుగురు చిన్నారులు కారుపై ఎక్కి ఆడుకోవడం కనిపించింది. వాళ్లు అద్దంపై జారడం, వెదురు కర్రలతో కొట్టడం వంటి దృశ్యాలు బయటపడ్డాయి.
ఈ ఘటనలో కారు బానెట్, పైకప్పు, ఫెండర్లు, టెయిల్ లైట్లు, అద్దాలు దెబ్బతిన్నాయి. ముందు బంపర్ కూడా పగిలినట్లు గుర్తించారు. ఈ కారుకు మార్కెట్ విలువ సుమారు దాదాపు రూ.5.04 కోట్లు. అసలు విడిభాగాలతో మరమ్మతులకు సుమారు దాదాపు రూ.95 లక్షలు ఖర్చవుతుందని అంచనా. ప్రత్యామ్నాయ విడిభాగాలు ఉపయోగిస్తే ఖర్చు సుమారు రూ.28 లక్షలకు తగ్గే అవకాశం ఉందని స్థానిక మీడియా తెలిపింది.
యజమాని మొదట పోలీసులను ఆశ్రయించి, చిన్నారుల తల్లిదండ్రులతో రెండు దఫాల చర్చలు జరిపాడు. అయితే వారు కేవలం రూ.4.75 లక్షలు మాత్రమే పరిహారంగా ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అంతేకాకుండా చిన్నారులతో క్షమాపణ కూడా చెప్పించలేదని సమాచారం. దీంతో అసంతృప్తికి గురైన ఫెరారీ యజమాని పూర్తి మరమ్మతుల ఖర్చును వసూలు చేసేందుకు కోర్టులో సివిల్ కేసు వేశాడు.