అమెరికా కథనాలన్నీ అవాస్తవం: ఇజ్రాయెల్‌

Israel denies New York Times report on targeting Iranian leaders
  • ఇరాన్ అగ్రనేతలను ఇజ్రాయెల్‌ లక్ష్యంగా చేసుకుందంటూ ఇటీవల న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం
  • అమెరికా ఉప్పందించడంతో ఇరాన్‌ అప్రమత్తమైందని వెల్లడి
  • ఈ వార్తలను తీవ్రంగా ఖండించిన ఇజ్రాయెల్‌
  • పూర్తిగా అవాస్తవాలని వివరణ
శాంతి చర్చల్లో పాల్గొన్న ఇరాన్‌ కీలక నేతలను తాము హత్య చేయాలనుకున్నట్లు అమెరికా మీడియా ప్రచురించిన కథనాన్ని ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. ఆ వార్త పూర్తిగా అవాస్తవమంటూ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం స్పష్టం చేసింది.

న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ గాలిబాఫ్‌లను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన అమెరికా ఇజ్రాయెల్‌కు సమాచారం అందించింది. వీరిద్దరూ కాల్పుల విరమణ, శాంతి ఒప్పంద చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపింది.

ఈ కథనంపై స్పందించిన నెతన్యాహు కార్యాలయం ‘‘ఇజ్రాయెల్, ఇరాన్ చర్చల ప్రతినిధులపై న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన తాజా కథనం పూర్తిగా కల్పితం. వాస్తవాలకు ఏమాత్రం దగ్గరగా లేదు’’ అని ఎక్స్ వేదికగా ప్రకటించింది.

అమెరికా అధికారుల ఆందోళనలపై కథనం న్యూయార్క్ టైమ్స్ మరింత వివరించింది. ఏప్రిల్‌లో ప్రారంభమైన శాంతి చర్చల సమయంలో ఇరాన్ నేతలపై దాడి జరిగితే చర్చలు పూర్తిగా భగ్నమవుతాయని అమెరికా భావించినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు హెచ్చరికలు పంపాలని నిర్ణయించినట్లు కథనంలో పేర్కొంది.

ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఈ కథనం వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఇజ్రాయెల్‌ స్పందించాల్సి వచ్చింది.
Israel
Benjamin Netanyahu
New York Times
Iran
Abbas Araghchi
Peace Talks

More Telugu News