సుప్రీంకోర్టుకు వెళతా: బండ్ల గణేశ్

Bandla Ganesh to challenge High Court order on property auction
  • బండ్ల గణేశ్ కుటుంబ ఆస్తిని వేలం వేసిన యూనియన్ బ్యాంక్
  • మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకు విక్రయించారని బండ్ల ఆగ్రహం
  • న్యాయం కోసం, తన హక్కుల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని వెల్లడి

తన కుటుంబ ఆస్తిని బ్యాంక్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వేలం వేశారంటూ టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ సంచలన ఆరోపణలు చేశారు. రుణ వసూళ్ల ప్రక్రియలో భాగంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన స్థిరాస్తిని యూనియన్ బ్యాంక్ వేలం వేయడం సబబేనంటూ తాజాగా హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో, బండ్ల గణేశ్ స్పందించారు. ఈ వివాదంపై ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.


బ్యాంకు అధికారులు లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుని, అత్యంత అన్యాయంగా మార్కెట్ ధర కంటే చాలా తక్కువ రేటుకే తన ఆస్తిని విక్రయించేశారని బండ్ల గణేశ్ ఆరోపించారు. "ఈ అన్యాయాన్ని ఎదిరిస్తూ 2022లోనే నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించాను. అప్పట్లో కింది కోర్టు అయిన డెట్ రికవరీ ట్రైబ్యునల్ లో నాకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. కానీ, తాజాగా హైకోర్టులో నాకు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది. అయినప్పటికీ నాకు భారత న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. నా హక్కుల కోసం, న్యాయం కోసం త్వరలోనే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాను" అని ఆయన స్పష్టం చేశారు.


కేసు వివరాల్లోకి వెళ్తే... బండ్ల గణేశ్ కుటుంబం తీసుకున్న రుణాల వసూళ్లలో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి జూబ్లీహిల్స్ ఆస్తిని వేలం ద్వారా విక్రయించింది. అయితే ఆ వేలం ప్రక్రియ చెల్లదని, దాన్ని రద్దు చేయడంతో పాటు వేలం ద్వారా వచ్చిన సొమ్మును తిరిగి ఆస్తి యజమానులకే చెల్లించాలంటూ గతంలో బ్యాంకును ట్రైబ్యునల్ ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ యూనియన్ బ్యాంక్ హైకోర్టును ఆశ్రయించగా... విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం డీఆర్‌టీ తీర్పును కొట్టేస్తూ, బ్యాంక్ జరిపిన ఆస్తి వేలం చట్టబద్ధమేనంటూ తీర్పు వెలువరించింది.

Bandla Ganesh
Union Bank of India
Jubilee Hills property auction
Supreme Court of India
High Court verdict
Debt Recovery Tribunal

More Telugu News