ఈస్పోర్ట్స్ వరల్డ్ కప్‌లో భారత్‌కు శాశ్వత స్థానం.. అంతర్జాతీయ వేదికపై సరికొత్త చరిత్ర!

India gets permanent spot in Esports World Cup creating history on international stage
  • గ్లోబల్ ఈస్పోర్ట్స్ రోడ్‌మ్యాప్‌లో భారత్
  • జియోబ్లాస్ట్, చెస్.కామ్, ఈడబ్ల్యూసీ భాగస్వామ్యం
  • వరల్డ్ కప్ రేసులో విదిత్
  • భారత చెస్ స్వర్ణయుగానికి గుర్తింపు
  • ఈస్పోర్ట్స్‌లో యువతకు అరుదైన అవకాశం
భారత క్రీడారంగ సంప్రదాయ సరిహద్దులు డిజిటల్ ప్రపంచంలోకి వేగంగా విస్తరిస్తున్నాయి. జియోబ్లాస్ట్ , చెస్.కామ్, ఈస్పోర్ట్స్ వరల్డ్ కప్ (ఈడబ్ల్యూసీ) ఫౌండేషన్ సంయుక్త భాగస్వామ్యంతో ప్రారంభమైన ‘ఇండియా రైజింగ్: రోడ్ టు ఈడబ్ల్యూసీ’ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. 

దీని ద్వారా అధికారిక అంతర్జాతీయ ఈస్పోర్ట్స్ వరల్డ్ కప్ రోడ్‌మ్యాప్‌లో భారతదేశానికి ఒక శాశ్వత క్వాలిఫికేషన్ మార్గం లభించింది. ఈ అరుదైన మైలురాయిని మరింత సుస్థిరం చేస్తూ, నేడు (శనివారం) జరిగే ప్రతిష్ఠాత్మక ఈస్పోర్ట్స్ చెస్ వరల్డ్ కప్ అర్హత పోరులో భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ గుజరాతీ, డచ్ గ్రాండ్‌మాస్టర్ బెంజమిన్ బోక్‌తో తలపడనున్నాడు.

భారతదేశంలో ప్రస్తుతం చెస్ క్రీడ అపూర్వమైన స్వర్ణయుగాన్ని అనుభవిస్తోందని, అందుకే ఈ డిజిటల్ విప్లవానికి చదరంగమే సరైన వేదిక అని గ్రాండ్‌మాస్టర్ విదిత్ గుజరాతీ అభిప్రాయపడ్డాడు. ఒలింపియాడ్ గోల్డ్ మెడల్, ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్, ఉమెన్స్ వరల్డ్ కప్ విన్నర్ ఇలా అత్యుత్తమ ప్రదర్శనలతో భారత్ చెస్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని ఆయన గుర్తుచేశాడు. 

ఈ అంతర్జాతీయ ఈస్పోర్ట్స్ వేదికపై భారతీయ ప్రతినిధులు ఉండటం ఎంతో కీలకమని, వరల్డ్ కప్‌లో భారత్ అత్యంత ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. ఈ పోరులో విదిత్ విజయం సాధిస్తే.. అరవింద్ చిదంబరం, నిహాల్ సరిన్, అర్జున్ ఇరిగైసిల తర్వాత ఈడబ్ల్యూసీ ప్రధాన ఈవెంట్‌కు అర్హత సాధించిన నాలుగో భారతీయ ఆటగాడిగా నిలుస్తాడు.

యువశక్తే మన బలం..
భారతదేశాన్ని గ్లోబల్ రోడ్‌మ్యాప్‌లోకి తీసుకురావడం అనేది తాత్కాలిక డిజిటల్ వినోదం కోసం కాదు, దేశీయ ఆటగాళ్లకు శాశ్వత అవకాశాలు కల్పించడమే తమ ఉద్దేశమని జియోబ్లాస్ట్ సీఈవో చార్లీ కౌడ్రీ వెల్లడించారు. దేశంలో 35 ఏళ్లలోపు జనాభా 65 శాతం ఉండటం, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గేమింగ్ మార్కెట్‌గా భారత్ ఎదగడం అంతర్జాతీయ స్టేక్‌హోల్డర్లను ఆకర్షించింది. 

'గ్లోబల్ ఈస్పోర్ట్స్‌లో భారత్ అత్యంత కీలకమైన వృద్ధి మార్కెట్' అని ఈస్పోర్ట్స్ వరల్డ్ కప్ ఫౌండేషన్ డిప్యూటీ సీఈవో మైక్ మెక్‌కేబ్ ప్రశంసించారు. భారత్ లేకుండా గ్లోబల్ ఈస్పోర్ట్స్ భవిష్యత్తును ఊహించలేమని ఆయన స్పష్టం చేశారు. స్థానిక ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి చేర్చేందుకు ఈ సరికొత్త వ్యవస్థ ఎంతగానో తోడ్పడుతుందని, భవిష్యత్తులో భారతీయ ఆటగాళ్లు ప్రపంచ వేదికపై కప్పులు గెలవడమే తమ అంతిమ లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు.
Esports World Cup
Vidit Gujrathi
India Rising Road to EWC
JioBlast
Chess World Cup
Indian Gaming Market

More Telugu News