మేం మంచివాళ్లం.. అందుకే ఖమేనీ అంత్యక్రియలకు వారం గడువిచ్చాం: ట్రంప్
- ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో ఖమేనీ మృతి
- టెహ్రాన్‌లో వారం రోజుల సంతాప కార్యక్రమాలు ప్రారంభం
- జులై 9న మషద్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
- అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ట్రంప్ వ్యాఖ్యలు
- ఒప్పందం కోసం ఇరాన్ ఆత్రుతగా ఉందని వ్యాఖ్య
- ఖమేనీ అంత్యక్రియలపైనా వివాదాస్పద వ్యాఖ్యలు
అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా సౌత్ డకొటాలోని మౌంట్ రష్‌మోర్ వద్ద జరిగిన సభలో ట్రంప్ మాట్లాడారు. ఇటీవల జరిగిన అమెరికా-ఇరాన్ ఘర్షణను ప్రస్తావిస్తూ ‘‘ఇరాన్‌ను మేం భారీ దెబ్బ కొట్టాం. ఇప్పుడు వాళ్లు ఒప్పందం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అంత్యక్రియల కోసం వారం రోజుల విరామం ఇచ్చాం. ఎందుకంటే మేం మంచివాళ్లం’’ అని అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలకు సభలో పాల్గొన్నవారు చప్పట్లతో స్పందించారు.
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. అదే దాడిలో ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. యుద్ధ పరిస్థితులు, భద్రతా కారణాల వల్ల అంత్యక్రియలను వెంటనే నిర్వహించకుండా వాయిదా వేసిన ఇరాన్, ఇటీవల తాత్కాలిక కాల్పుల విరమణ అనంతరం వారం రోజుల సంతాప కార్యక్రమాలను ప్రారంభించింది.
టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లాలో శుక్రవారం అంత్యక్రియల కార్యక్రమం ప్రారంభమైంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వేలాది మంది నల్ల దుస్తుల్లో హాజరై ఖమేనీకి నివాళులర్పించారు.