థాయ్‌లాండ్ వెళుతున్నారా?.. అయితే తప్పనిసరిగా ఇవి పాటించాల్సిందే!

Planning a trip to Thailand You must follow these mandatory rules
  • థాయ్‌లాండ్ వెళ్లే భారతీయులకు బ్యాంకాక్‌లోని ఎంబ‌సీ కీలక సూచనలు
  • వీసా ఆన్ అరైవల్ ప్రయాణికులకు చేతిలో రూ.57,000 నగదు ఉండాల‌ని వెల్ల‌డి
  • ప్రయాణానికి 72 గంటల ముందు థాయ్‌లాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్ పూర్తి చేయాలన్న ఎంబ‌సీ
  • ఉద్యోగం కోసం వెళ్లేవారు టూరిస్ట్ వీసాలపై ప్రయాణించవద్దని హెచ్చరిక
  • కన్ఫర్మ్ చేసిన రిటర్న్ టికెట్లు, హోటల్ బుకింగ్స్ తప్పనిసరిగా ఉండాలని సూచన
భారతీయులకు ఇష్టమైన పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన థాయ్‌లాండ్‌కు వెళ్లాలనుకునే వారు ఇకపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణానికి ముందు అక్కడి నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవడం అత్యవసరం. ఈ నేపథ్యంలో, బ్యాంకాక్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ నెల‌ 2న భారత పౌరుల కోసం ప్రత్యేకంగా ఒక కీలక సలహా జారీ చేసింది. థాయ్‌లాండ్ ప్రభుత్వం ఇటీవల భారతీయులకు వీసా రహిత ప్రయాణ సదుపాయాన్ని నిలిపివేయడంతో, ఈ కొత్త మార్గదర్శకాలకు ప్రాధాన్యం ఏర్పడింది.

ప్రధానంగా తెలుసుకోవాల్సినవి
రాయబార కార్యాలయం జారీ చేసిన సూచనల ప్రకారం.. థాయ్‌లాండ్ వెళ్లే ప్రతి ప్రయాణికుడి వద్ద కనీసం ఆరు నెలల చెల్లుబాటు ఉండే పాస్‌పోర్ట్ తప్పనిసరిగా ఉండాలి. దీంతో పాటు కన్ఫర్మ్ చేసిన రిటర్న్ టికెట్లు, హోటల్ బుకింగ్ వివరాలు, స్పష్టమైన ప్రయాణ ప్రణాళిక కూడా వెంట ఉంచుకోవాలి. ముఖ్యంగా ప్రయాణానికి 72 గంటల ముందు ఆన్‌లైన్‌లో 'థాయ్‌లాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్' (టీడీఏసీ) పూర్తి చేయాలి. దీనిని థాయ్ ఇమ్మిగ్రేషన్ పోర్టల్ ద్వారా సమర్పించినప్పుడు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఇమ్మిగ్రేషన్ చెకింగ్ సమయంలో అధికారులు దీనిని అడిగే అవకాశం ఉంది.

వీసా, నగదు నిబంధనలు
భారత ప్రయాణికులు తమ పర్యటన ఉద్దేశాన్ని బట్టి సరైన వీసాను పొందాలని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ముఖ్యంగా వీసా ఆన్ అరైవల్ (వీఓఏ) లేదా వీసా మినహాయింపు సదుపాయాన్ని ఉపయోగించుకునే వారు తమ వెంట కనీసం 20,000 థాయ్ బట్ (సుమారు రూ. 57,446) నగదు రూపంలో తప్పనిసరిగా తీసుకెళ్లాలి. దేశంలో పర్యటించడానికి తగినన్ని నిధులు ఉన్నాయో? లేదో? నిర్ధారించుకోవడానికి ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈ నగదును చూపించమని కోరవచ్చని తెలిపింది.

ఉద్యోగార్థులు, ట్రాన్సిట్ ప్రయాణికులకు హెచ్చరిక
థాయ్‌లాండ్‌లో ఉద్యోగం సంపాదించిన వారు పొరపాటున కూడా వీసా ఆన్ అరైవల్ లేదా టూరిస్ట్ వీసాపై ప్రయాణించవద్దని రాయబార కార్యాలయం గట్టిగా హెచ్చరించింది. అలాంటి వారు ప్రయాణానికి ముందే సంబంధిత వర్క్ వీసాను పొందాలి. టూరిస్ట్ వీసాపై వచ్చి ఉద్యోగంలో చేరడం స్థానిక ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేసింది. అలాగే, థాయ్‌లాండ్ మీదుగా ఇతర దేశాలకు వెళ్లే ట్రాన్సిట్ ప్రయాణికులు, తమ గమ్యస్థాన దేశానికి సంబంధించిన వీసా, ఇతర ప్రయాణ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది.

ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు, బయలుదేరే ముందే అవసరమైన అన్ని పత్రాలు, నిబంధనలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని భారత రాయబార కార్యాలయం ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా తమ డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలని, ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్ద సమయాన్ని వృథా చేయకుండా సహకరించాలని కోరింది.
Thailand
Thailand Travel Guidelines
Indian Embassy Bangkok
Thailand Digital Arrival Card
Thailand Visa for Indians
Thailand Travel Advisory

More Telugu News