లాహోర్‌లో విదేశీ మహిళలపై సామూహిక‌ అత్యాచారం.. పాక్ ఉప ప్రధాని బంధువు అరెస్ట్

Pakistan Deputy PM relative arrested for gang rape of foreign women in Lahore
  • లాహోర్‌లో నెదర్లాండ్స్, వెనిజులా మహిళలపై కిడ్నాప్, అత్యాచారం
  • ప్రధాన నిందితుడితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • క్రిప్టో వ్యాపారం కోసం పాక్‌కు ఆహ్వానించి దారుణానికి పాల్పడ్డ నిందితులు
  • నిందితులకు ఐదు రోజుల పోలీస్ రిమాండ్ విధించిన లాహోర్ కోర్టు
పాకిస్థాన్‌లో సంచలనం సృష్టించిన ఇద్దరు విదేశీ మహిళలపై సామూహిక అత్యాచారం కేసులో పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ సమీప బంధువును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు లాహోర్ పోలీసులు వెల్లడించారు. ప్రధాన నిందితుడైన మహ్మద్ రజా దార్‌తో పాటు హసన్ రజా, సికందర్ ఖాన్, సాజిద్ అలీలను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరచగా వారికి ఐదు రోజుల పోలీస్ రిమాండ్ విధించారు.

జూన్ 29న లాహోర్‌లో ఈ దారుణం జరిగింది. బాధితుల్లో ఒకరు నెదర్లాండ్స్‌కు చెందినవారు కాగా, మరొకరు వెనిజులా జాతీయురాలు. వీరిని ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితుల్లో ఒకరి తండ్రి స్పెయిన్ నుంచి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మహిళలను రక్షించారు. ఈ ఘటనపై పాకిస్థాన్ పీనల్ కోడ్ సెక్షన్ 365ఏ (కిడ్నాప్), 375ఏ (సామూహిక అత్యాచారం) కింద కేసు నమోదు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. 2025 అక్టోబర్‌లో సింగపూర్‌లో ప్రధాన నిందితుడు రజా దార్‌తో బాధితులకు పరిచయం ఏర్పడింది. క్రిప్టోకరెన్సీ వ్యాపారంలో వీరు భాగస్వాములు. వ్యాపార పనుల మీద పాకిస్థాన్‌కు రావాలని రజా దార్ వారిని ఆహ్వానించి, బిజినెస్ వీసాలు కూడా ఏర్పాటు చేశాడు. జూన్ 29న వారు లాహోర్ చేరుకోగానే, రజా దార్, అతని స్నేహితులు వారిని కిడ్నాప్ చేసి ఓ ఇంట్లో బంధించారు. అక్కడ వారిపై అత్యాచారానికి పాల్పడి, విడుదల చేయాలంటే డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బాధితులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.

"ఈ కేసులో పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ బంధువు ప్రమేయం ఉండటంతో ఇది చాలా సున్నితమైన విషయంగా మారింది. అందుకే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం" అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచినప్పుడు, బాధితులు ప్రధాన నిందితుడిగా రజా దార్‌ను గుర్తించినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. పరారీలో ఉన్న ఐదో నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.
Raza Dar
Ishaq Dar relative arrested
Lahore gang rape case
Pakistan crime news
Foreign women kidnapped Pakistan
Pakistan Deputy PM relative

More Telugu News