మేము తెచ్చిన ప్రాజెక్టులకే మళ్లీ శంకుస్థాపనలా?: చంద్రబాబుపై గుడివాడ అమర్నాథ్ ఫైర్

Gudivada Amarnath criticizes Chandrababu Naidu over industrial failure and credit theft
  • క్రెడిట్ చోరీలో చంద్రబాబు దేశంలోనే నెంబర్ వన్ అన్న గుడివాడ
  • కడప స్టీల్ ప్లాంట్ కోసం తమ ప్రభుత్వ హయాంలోనే అన్ని జీవోలు ఇచ్చామని వెల్లడి
  • మంత్రులు ప్రతిపక్షాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపాటు

కొత్త పరిశ్రమలు తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తాము తీసుకొచ్చిన ప్రాజెక్టులకే ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ శంకుస్థాపనలు చేస్తూ పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారని దుయ్యబట్టారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


క్రెడిట్ చోరీ చేయడంలో చంద్రబాబు దేశంలోనే ఫస్ట్ ర్యాంక్‌లో ఉంటారని అమర్నాథ్ ఎద్దేవా చేశారు. కడప జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ కోసం 2022లోనే వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు, రాయితీలు, నీరు, విద్యుత్, రైల్వే కనెక్టివిటీ వంటి మౌలిక వసతులను కల్పిస్తూ జీవోలు ఇచ్చిందని అమర్నాథ్ గుర్తుచేశారు. 


ఆ పనులు వేగంగా జరుగుతున్న సమయంలోనే ప్రభుత్వం మారిందని, కూటమి అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లవుతున్నా కొత్తగా ఒక్క పరిశ్రమను కూడా తేవడం చేతకాక, పాత ప్రాజెక్టులకే మళ్లీ శంకుస్థాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. 'మళ్లీ మళ్లీ జరగాలి పెళ్లి' అన్నట్లుగా చంద్రబాబు కేవలం శిలాఫలకాలతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. కూటమి నేతల వేధింపుల భయంతో జిందాల్ వంటి బడా సంస్థలు తమ పెట్టుబడులను పక్క రాష్ట్రాలకు తరలించుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.


జగన్‌ను ‘సైకో’ అంటూ చంద్రబాబు విమర్శించడాన్ని అమర్నాథ్ తీవ్రంగా తప్పుపట్టారు. గతంలో టీడీపీ నేతలు చింతమనేని ప్రభాకర్, బాలకృష్ణ మహిళలను, ప్రజాప్రతినిధులను అవమానించినప్పుడు ఏ సైకో అండతో మాట్లాడారో చంద్రబాబు చెప్పాలని నిలదీశారు. "ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారు" అని నాడు వ్యాఖ్యానించిన అసలైన సైకో ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. వెన్నుపోటు, ద్రోహానికి ఈ దేశంలో పేటెంట్ చంద్రబాబేనని, పిల్లనిచ్చిన మామకు, జన్మనిచ్చిన సీమకు ఆయన చేసిన ద్రోహం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.


ఓటర్ల ఎన్యుమరేషన్ ప్రక్రియపై మాట్లాడుతూ... టీడీపీకి చెందిన బీఎల్ఓలు అక్రమంగా ఓటర్ల ఇళ్లకు వెళుతుంటే ప్రజలు వారిని నిలదీస్తున్నారని, అందుకే గత రెండు రోజులుగా వారు వెనక్కి తగ్గుతున్నారని చెప్పారు. ప్రభుత్వాన్ని, వారి వైఫల్యాలను ప్రశ్నించే వారిపై అన్యాయంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు తమ సొంత శాఖల ప్రగతిని వదిలేసి, ప్రతిపక్షాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇదొక అత్యంత ‘అట్టర్ ఫెయిల్యూర్ క్యాబినెట్’ అని విమర్శించారు.

Gudivada Amarnath
Chandrababu Naidu
JSW Steel Plant Kadapa
Andhra Pradesh Politics
YSRCP vs TDP
Andhra Pradesh Industrial Development

More Telugu News