రూ.450 కోట్ల రుషికొండ భవనాల వినియోగంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- వైసీపీ ప్రభుత్వ హయాంలో రుషికొండపై భారీ భవనాల నిర్మాణం
- రెండేళ్లుగా నిరూపయోగంగా పడి ఉన్న భవనాలు
- భవనాలను లీజుకు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం
విశాఖపట్నంలో నిర్మించిన వివాదాస్పద రుషికొండ పర్యాటక భవనాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.450 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ ప్యాలెస్ లాంటి భవనాలను 'ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్' (O&M) ప్రాతిపదికన లీజుకు ఇవ్వాలని ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో వీటిని నిర్వహించేందుకు ఆసక్తి గల సంస్థల నుంచి 'ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్' (EOI) కోరుతూ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
రాజకీయ వివాదాలు, కోర్టు కేసుల కారణంగా గత రెండేళ్లుగా ఈ భవనాలు ఎలాంటి వినియోగం లేకుండా ఖాళీగా పడి ఉన్నాయి. ఫలితంగా ఇవి క్రమంగా దెబ్బతింటున్నాయని, పైగా వీటి భద్రత, నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతి నెల దాదాపు రూ.25 లక్షల ప్రజాధనాన్ని వృథాగా ఖర్చు చేయాల్సి వస్తోందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రుషికొండ భవనాలపై అధ్యయనం చేసిన మంత్రివర్గ ఉపసంఘం... వీటిని ఒక లగ్జరీ రిసార్ట్‌గా మార్చితే పర్యాటక రంగానికి లాభసాటిగా ఉంటుందని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ నివేదిక ఆధారంగానే లీజు ప్రక్రియ మొదలైంది.
అయితే, ఈ లగ్జరీ రిసార్ట్ ప్రాజెక్టును దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతున్న పలువురు బడా పెట్టుబడిదారులు... ప్రస్తుతం ఉన్న భవనాలకు అదనంగా మరికొన్ని కొత్త నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానీ, రుషికొండపై జరిగిన నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే తీర ప్రాంత నియంత్రణ మండలి నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు ఉండటం, జాతీయ హరిత ట్రైబ్యునల్ తో పాటు కోర్టుల్లో కేసులు నడుస్తుండటంతో... అదనపు అనుమతుల అంశంపై ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది.