పాక్‌ విఫల దేశంగా మారే అంచున ఉంది.. సింగపూర్‌ మాజీ రాయబారి

  • దౌత్యం వహించినంత మాత్రాన ప్రజలకు ఆహారం అందదంటూ చురకలు
  • ఆర్థిక సంక్షోభం కొనసాగుతోందన్న సింగపూర్‌ దౌత్యవేత్త కౌశికన్‌ 
  • రుణాలపైనే ఆ దేశం ఆధారపడుతోందని స్పష్టీకరణ
  • అమెరికా ఆంక్షలు కొనసాగొచ్చని అంచనా
ఇరాన్‌తో ఉద్రిక్తతలను తగ్గించడంలో మధ్యవర్తిత్వం వహించి పాకిస్థాన్‌ అమెరికా దగ్గర కొన్ని మార్కులు కొట్టేసింది. అయితే ఈ దౌత్య చర్యల వల్ల పాక్‌ ప్రజల సమస్యలు పరిష్కారం కావని సింగపూర్ మాజీ రాయబారి బిలహరి కౌశికన్ స్పష్టం చేశారు. ఓ ప్రపంచ సదస్సులో మాట్లాడిన ఆయన.. పాకిస్థాన్ ఇప్పటికీ విఫల దేశంగా మారే అంచునే ఉందని తేల్చి చెప్పారు.

అమెరికా దృష్టిలో పాకిస్థాన్ తన దౌత్య ప్రతిష్ఠను కొంత మెరుగుపరుచుకుందని బిలహరి అభిప్రాయపడ్డారు. కానీ ఆ విజయంతో ప్రజలకు ఆహారం అందదని, దేశ ఆర్థిక సంక్షోభం అలాగే కొనసాగుతుందని పేర్కొన్నారు. భారీ అప్పులు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల రుణాలపైనే పాకిస్థాన్ ఆధారపడుతోందని గుర్తుచేశారు.

ప్రపంచ బ్యాంకు, ‘అంతర్జాతీయ ద్రవ్య నిధి’ (ఐఎంఎఫ్‌) వంటి సంస్థల సాయంతోనే పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ నడుస్తోందని కౌశికన్ అన్నారు. మరోవైపు దేశంలో ఆహార సంక్షోభం కూడా తీవ్రంగా ఉందని, ఈ పరిస్థితుల్లో దౌత్య విజయాలు ప్రజల జీవితాలను మార్చలేవని వ్యాఖ్యానించారు.

పాకిస్థాన్ ఇంకా పూర్తిగా విఫల దేశంగా మారలేదని, అది ప్రపంచానికి ఊరటనిచ్చే విషయమని కౌశికన్ అన్నారు. అయినప్పటికీ దౌత్య విజయాలు దేశ వాస్తవ పరిస్థితిని మార్చవని, పాకిస్థాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలు పూర్తిగా తొలగిపోయే అవకాశాలు కూడా కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు.

More Telugu News