ఏపీలో జూనియర్ న్యాయవాదులకు తీపికబురు.. మంత్రి ఫరూక్ కీలక ప్రకటన

NMD Farooq announces good news for junior lawyers in Andhra Pradesh
  • కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న‌ మంత్రి ఫరూక్
  • జూనియర్ న్యాయవాదుల స్టైఫండ్‌ రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు 
  • రాష్ట్రంలో కొత్తగా 96 కోర్టుల ఏర్పాటు.. 1770 పోస్టుల భర్తీకి ఆమోదం
  • లా ఆఫీసర్ల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంపు
  • న్యాయవ్యవస్థ మౌలిక సదుపాయాల కోసం రూ.216 కోట్ల కేటాయింపు
రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని, దీనికి సంబంధించి అవసరమైన అన్ని ప్రక్రియలను వేగవంతం చేస్తున్నామని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ స్పష్టం చేశారు. తన రెండేళ్ల పాలన పురోగతిని వివరిస్తూ ఆయన ఈ ప్రకటన చేశారు.

బెంచ్ ఏర్పాటు కోసం కర్నూలులో ఇప్పటికే స్థలాన్ని కేటాయించామని, ప్రస్తుతం హైకోర్టుతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా దీనికి సంబంధించిన ప్రతిపాదనలు పంపామని, అన్ని అనుమతులు పొంది, త్వరలోనే బెంచ్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు.

ఇదే సందర్భంగా రాష్ట్రంలోని జూనియర్ న్యాయవాదులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. జూనియర్ న్యాయవాదులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.5,000 స్టైఫండ్‌ను రెట్టింపు చేస్తూ రూ.10,000కు పెంచుతున్నట్లు మంత్రి ఫరూక్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే జారీ చేస్తామని వెల్లడించారు.

న్యాయవ్యవస్థ బలోపేతం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఇతర చర్యలను కూడా ఆయన వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 96 కోర్టులను ఏర్పాటు చేయడంతో పాటు న్యాయవ్యవస్థలో 1770 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. కోర్టు భవనాలు, న్యాయమూర్తుల నివాస గృహాలు, అతిథి గృహాల నిర్మాణం, అభివృద్ధి కోసం రూ.216 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

ఇతర కీలక నిర్ణయాలలో భాగంగా, లా ఆఫీసర్ల పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచామని, హైకోర్టు జడ్జిల గ్రాట్యుటీ పరిమితిని రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. హైకోర్టులోని ఏజీపీల గౌరవ వేతనాన్ని 25 శాతం పెంచగా, స్పెషల్ జ్యుడిషియరీ మేజిస్ట్రేట్‌ల గౌరవ వేతనాన్ని రూ.30,000 నుంచి రూ.45,000కు పెంచి, వారికి అదనంగా నెలకు రూ.5,000 రవాణా ఖర్చులు మంజూరు చేసినట్లు మంత్రి ఫరూక్ వివరించారు.
NMD Farooq
Andhra Pradesh Law Minister
Kurnool High Court Bench
Junior Lawyer Stipend Hike
AP Judiciary Recruitment
Law Department Reforms AP

More Telugu News