15 ఏళ్ల నాటి లాకప్ డెత్ కేసులో.. స్టేషన్ ఇన్‌ఛార్జ్ సహా 9 మంది పోలీసులకు జీవితఖైదు!
- 2011 నాటి పోలీస్ కస్టడీ మరణం కేసులో ‘మహా’ కోర్టు చారిత్రాత్మక తీర్పు
- తీవ్రమైన హింస కారణంగా 44 గాయాలు, ఎముకల ఫ్రాక్చర్లతో మరణించిన యువకుడు
- నిందితులుగా తేలిన 9 మంది పోలీసులకు జీవిత ఖైదు
- గతంలో కేసు నమోదుకు నిరాకరించిన స్థానిక పోలీసులు
- సీఐడీ విచారణతో వెలుగులోకి నిజాలు
- తీర్పుతో ఊరట చెందిన బాధితుడి వృద్ధ తల్లిదండ్రులు
అసలేం జరిగింది?
ఈ కేసు పూర్వపరాల్లోకి వెళ్తే.. 2011 మే 10వ తేదీ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మహారాష్ట్రలోని రిసోద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే 'పార్ధి' (గిరిజన తెగ) వర్గానికి చెందిన 23 ఏళ్ల యువకుడు బెగ్యా నైను పవార్‌ను దొంగతనం అనుమానంతో పోలీసులు అతడిని ఇంటి నుంచి అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి క్రిమినల్ రికార్డ్ లేని బెగ్యా పవార్‌ను స్టేషన్‌కు తరలించి, నేరం అంగీకరించాలంటూ అప్పటి రిసోద్ థానేదార్ మహదేవ్ మాణిక్ ధాండే, ఇతర సిబ్బంది థర్డ్ డిగ్రీ ఉపయోగించి అత్యంత అనాగరికంగా కొట్టారు.
పోలీసుల అమానుష దాడి కారణంగా బెగ్యా పవార్ పరిస్థితి విషమించడంతో ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. అనంతరం నిర్వహించిన పోస్ట్‌మార్టం నివేదికలో బెగ్యా పవార్ శరీరంపై 44 తీవ్రమైన గాయాలు, రక్తం గడ్డకట్టిన గుర్తులు, ఎముకలు విరిగినట్లు తేలడంతో పోలీసులు చేసిన అరాచకం ప్రపంచానికి తెలిసింది.
న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం
ఘటన జరిగిన తర్వాత, బాధితుడి వృద్ధ తల్లిదండ్రులు రిసోద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పటికీ, నిందితులు తమ అధికారులే కావడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేయడానికి నిరాకరించారు. దీంతో పార్ధి సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగింది. ప్రభుత్వం ఈ కేసును మహారాష్ట్ర సీఐడీకి బదిలీ చేసింది. నిష్పక్షపాతంగా విచారణ జరిపిన సీఐడీ అధికారులు, దారుణానికి ఒడిగట్టిన తొమ్మిది మంది పోలీసులపై పక్కా ఆధారాలతో కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
కోర్టు సంచలన తీర్పు
ఈ కేసుపై సుదీర్ఘంగా సాగిన వాదనల అనంతరం, ప్రత్యేక న్యాయమూర్తి జె.పి.జపాటే నిందితులైన తొమ్మిది మంది పోలీసులను దోషులుగా నిర్ధారించారు. పౌరుల ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వ సేవకులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అత్యంత క్రూరంగా ప్రవర్తించారని కోర్టు తప్పుబట్టింది. నిందితులలో ఇద్దరు ఇప్పటికే సర్వీస్ నుంచి రిటైర్ అయినప్పటికీ, చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేస్తూ వారందరికీ జీవిత ఖైదుతో పాటు తలా రూ. 56,000 జరిమానా విధించింది. ఈ జరిమానా మొత్తంలో 70 శాతం నిధులను బాధితుడి కుటుంబానికి నష్టపరిహారంగా అందించాలని కోర్టు ఆదేశించింది.
"నా కొడుకు ఏ తప్పూ చేయలేదు, వాడు అమాయకుడు. 15 ఏళ్ల తర్వాత మాకు న్యాయం లభించింది" అంటూ తీర్పు అనంతరం బెగ్యా పవార్ వృద్ధ తల్లి కన్నీటి పర్యంతమైంది.