మైదానంలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ 'కింగ్' కోహ్లీ హవా!
- 'ఎక్స్'లో కిమ్ కార్దాషియన్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ
- 69.9 మిలియన్ల ఫాలోవర్లతో 11వ స్థానానికి చేరిన భారత స్టార్
- జాబితాలో మస్క్, ఒబామా, ట్రంప్, రొనాల్డో, మోదీ వంటి ప్రముఖులు
ప్రస్తుతం కిమ్ కార్దాషియన్‌కు 69.7 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. విరాట్ కోహ్లీ 69.9 మిలియన్ల ఫాలోవర్లతో ఆమెను అధిగమించాడు. ఈ అరుదైన ఘనతతో కోహ్లీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల సరసన చేరాడు. అయితే, కోహ్లీ కన్నా ముందున్న టాప్ 10 జాబితాలో ప్రపంచంలోని అత్యంత ప్రముఖులు ఉన్నారు.
కోహ్లీ కంటే ముందున్న టాప్ 10 వీరే..
ప్రస్తుత నివేదికల ప్రకారం.. 'ఎక్స్' అధినేత ఎలాన్ మస్క్ సుమారు 240 మిలియన్ల ఫాలోవర్లతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (119.2 మిలియన్లు), డొనాల్డ్ ట్రంప్ (111.7 మిలియన్లు), ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (110.6 మిలియన్లు), భారత ప్రధాని నరేంద్ర మోదీ (106.9 మిలియన్లు) ఉన్నారు. వీరితో పాటు రిహానా, జస్టిన్ బీబర్, కేటీ పెర్రీ, టేలర్ స్విఫ్ట్, లేడీ గాగా వంటి సంగీత ప్రపంచంలోని స్టార్లు కూడా ఈ జాబితాలో కొనసాగుతున్నారు.
ఇంగ్లండ్‌తో సిరీస్‌కు పునరాగమనం.. లార్డ్స్ రికార్డుపై కన్ను
సోషల్ మీడియాలోనే కాదు మైదానంలో కూడా కింగ్ కోహ్లీ మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం అతను ఈ నెల 14 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఐపీఎల్ 2026 ఫైనల్‌లో గాయపడటంతో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమైన కోహ్లీ, జనవరి తర్వాత ఆడనున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే కావడం విశేషం. మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌తో కలిసి అలీబాగ్‌లో కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి.
ఈ పర్యటనలో కోహ్లీ ఓ అరుదైన రికార్డును అందుకునే అవకాశం ఉంది. లార్డ్స్ మైదానంలో జరగబోయే మ్యాచ్‌లో కనుక అతను సెంచరీ చేస్తే, 'క్రికెట్ మక్కా'గా పిలవబడే లార్డ్స్‌లో వన్డే శతకం చేసిన తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటివరకు ఏ భారతీయ ఆటగాడు కూడా ఈ మైదానంలో వన్డే సెంచరీ చేయలేదు. గతంలో ఎంఎస్ ధోని చేసిన 73 పరుగులే అత్యధిక స్కోరుగా ఉంది. దీంతో కోహ్లీ పునరాగమనంపై, లార్డ్స్ రికార్డుపై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.