శతాబ్దాల కంపెనీ సంచలనం.. స్టాక్ మార్కెట్లోకి పార్లే-జీ.. రూ.లక్ష కోట్ల విలువతో భారీ ఐపీఓ!
- భారీ ఐపీఓకు సిద్ధమవుతున్న పార్లే ప్రొడక్ట్స్
- రూ.లక్ష కోట్లకు పైగా వ్యాల్యుయేషన్‌తో మార్కెట్లోకి
- రూ.9,500 కోట్లకు పైగా నిధులు సమీకరించే యోచన
- దాదాపు వందేళ్ల తర్వాత పబ్లిక్‌గా మారనున్న కంపెనీ
దాదాపు వందేళ్లుగా ప్రైవేట్ సంస్థగా కొనసాగుతున్న పార్లే ప్రొడక్ట్స్ పబ్లిక్ ఇష్యూకు రానుండటం భారత కార్పొరేట్ రంగంలో ఒక ముఖ్యమైన పరిణామం. ఈ ఐపీఓ ప్రక్రియను నిర్వహించేందుకు కంపెనీ ఇప్పటికే కోటక్ మహీంద్రా క్యాపిటల్, యాక్సిస్ క్యాపిటల్, హెచ్ఎస్బీసీ సెక్యూరిటీస్‌లను సలహాదారులుగా నియమించుకున్నట్టు తెలుస్తోంది. త్వరలో మరో బ్యాంకును కూడా చేర్చుకునే అవకాశాలున్నాయి. అయితే, ఈ ప్రణాళికలన్నీ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని, మార్కెట్ పరిస్థితులను బట్టి తుది నిర్ణయాలు ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
1929లో ముంబైలోని విలే పార్లేలో ప్రారంభమైన ఈ సంస్థను చౌహాన్ కుటుంబం ప్రమోట్ చేస్తోంది. పార్లే-జీ, క్రాక్‌జాక్, మొనాకో, హైడ్ అండ్ సీక్ వంటి ఐకానిక్ బిస్కెట్లతో పాటు మ్యాంగో బైట్, మెలోడీ, పాపిన్స్ వంటి మిఠాయిలతో ఈ బ్రాండ్ దేశ ప్రజలకు దగ్గరైంది. అమెరికా, యూకే, కెనడా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాలతో పాటు పలు దేశాల్లో పార్లే ఉత్పత్తులకు బలమైన మార్కెట్ ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం 8.5% వృద్ధితో రూ.15,568 కోట్లకు చేరింది. అయితే, నికర లాభాలు మాత్రం 39% తగ్గి రూ.979 కోట్లుగా నమోదయ్యాయి.
ఐపీఓ ఊహాగానాలపై స్పందించిన కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మయాంక్ షా, మార్కెట్ స్పెక్యులేషన్‌పై తాము వ్యాఖ్యానించబోమని, ప్రస్తుతం వ్యాపార వృద్ధిపైనే దృష్టి సారిస్తున్నామని స్పష్టం చేశారు. ఒకవేళ ఈ ఐపీఓ ప్రణాళిక ప్రకారమే జరిగితే, ఇది భారత ఎఫ్ఎంసీజీ రంగంలోని అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా నిలిచిపోతుంది. ఇదిలా ఉండగా, చౌహాన్ కుటుంబంలో చీలిక తర్వాత ఏర్పడిన 'పార్లే ఆగ్రో' (ఫ్రూటీ, యాపీ ఫిజ్ బ్రాండ్లు)కు, ఈ పార్లే ప్రొడక్ట్స్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని గమనించాలి.