మారాం చేసే పిల్లలను ఎలా హ్యాండిల్ చేయాలి? సైకాలజీ చెబుతోంది ఇదే..
- మారాం సమయంలో ప్రశాంతంగా ఉండాలని నిపుణుల సూచన
- పిల్లలు చూసే నేర్చుకుంటారని వివరణ
- కోపం కాకుండా ఓపిక అవసరమని సూచన
- హద్దులు మాత్రం స్పష్టంగా ఉండాలని వెల్లడి
- తర్వాత మాట్లాడి వారికి అర్థమయ్యేలా చెప్పాలని సూచన
సైకాలజీ ప్రకారం చిన్నపిల్లల మెదడులో నిర్ణయాలు తీసుకోవడం, భావోద్వేగాలను నియంత్రించే భాగం ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందదు. అందువల్ల వారు కోపం, నిరాశ వంటి భావాలను సొంతంగా అదుపు చేసుకోలేరు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రుల ప్రశాంతమైన ప్రవర్తనే వారికి భద్రత భావనను కలిగిస్తుంది.
పిల్లలు పెద్దలను చూసే నేర్చుకుంటారని, తల్లిదండ్రులు తరచూ కోప్పడితే అదే సహజమని పిల్లలు భావించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అదే ప్రశాంతంగా మాట్లాడటం, ఓపిగ్గా స్పందించడం వంటి అలవాట్లు పిల్లల్లో కూడా క్రమంగా పెరుగుతాయని వివరిస్తున్నారు.
అయితే ప్రశాంతంగా ఉండడం అంటే పిల్లలు అడిగిన ప్రతిదానికీ ఒప్పుకోవడం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రేమతో పాటు స్పష్టమైన హద్దులు కూడా ఉండాలని సూచిస్తున్నారు. పిల్లలు శాంతించిన తర్వాత వారి సమస్య ఏంఓటో మాట్లాడి, భావాలను సరైన రీతిలో ఎలా వ్యక్తం చేయాలో నేర్పాలని సూచిస్తున్నారు.