అమెరికాలో విషాదం: వరదలో కారుతో సహా కొట్టుకుపోయిన ఏపీ టెక్కీ
- అమెరికాలోని కాన్సస్‌లో వరదల్లో చిక్కుకుని తెలుగు ఐటీ నిపుణుడు మృతి
- బాపట్ల జిల్లా దేవరపల్లికి చెందిన వెంకటేష్ దొప్పలపూడిగా గుర్తింపు
- కారుతో పాటు వరద నీటిలో కొట్టుకుపోయి దుర్మరణం
- మృతదేహాన్ని స్వదేశానికి పంపేందుకు భారత రాయబార కార్యాలయం ఏర్పాట్లు
శనివారం మధ్యాహ్నం హ్యూస్టన్ నుంచి నెబ్రాస్కాలోని ఒమాహా నగరంలో ఉన్న తన నివాసానికి వెంకటేష్ కారులో బయలుదేరాడు. మార్గమధ్యంలో కాన్సస్‌లోని సమ్నర్ కౌంటీలో భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు పోటెత్తాయి. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ఓ వంతెన సమీపంలో వరద ఉద్ధృతికి కొట్టుకుపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు.
అత్యవసర సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, వరద ప్రవాహం తీవ్రంగా ఉండటంతో గాలింపు చర్యలకు ఆటంకం కలిగింది. అనంతరం పోలీసులు డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో రాత్రంతా గాలించి, ఆదివారం ఉదయం వెంకటేష్ మృతదేహాన్ని వెలికితీశారు.
హెచ్-1బీ వీసాపై అమెరికాలో ఐటీ నిపుణుడిగా పనిచేస్తున్న వెంకటేష్ మృతి పట్ల హ్యూస్టన్‌లోని భారత కాన్సులేట్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని వెల్లడించింది. మరోవైపు, వెంకటేష్ కుటుంబాన్ని ఆదుకునేందుకు 'గోఫండ్‌మీ' ద్వారా నిధుల సేకరణ కూడా ప్రారంభించారు.