మగవాళ్లు బాధను ఎందుకు మనసులోనే దాచుకుంటారు?

Why Men Hide Their Pain and Emotions Deep Inside
  • పురుషుల్లో భావాలను దాచుకునే ధోరణి ఎక్కువ
  • సమాజ పరిమితులే ప్రధాన కారణమని నిపుణుల అభిప్రాయం
  • పురుషుల్లో పెరుగుతున్న ఆందోళన, డిప్రెషన్‌ కేసులు
  • ఒత్తిడి రూపంలో బయటపడుతున్న మానసిక సమస్యలు
  • కోపం, అలసట కూడా సంకేతాలే
మానసిక ఆరోగ్య సమస్యలు మహిళలకే కాదు.. పురుషులకూ పెద్ద సవాలుగానే మారుతున్నాయి. అయితే చాలామంది పురుషులు తమ భావాలను బయటకు చెప్పకుండా మనసులోనే దాచుకుంటున్నారని మానసిక ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమాజం పెట్టిన పరిమితులే దీనికి ప్రధాన కారణమని వారు చెబుతున్నారు.

న్యూస్ 18 కథనం ప్రకారం... చిన్నప్పటి నుంచే అబ్బాయిలకు ‘మగాడిలా ఉండు’, ‘ఏడవొద్దు’, ‘సమస్యలను నువ్వే ఎదుర్కో’ అనే సందేశాలు ఎక్కువగా అందుతుంటాయి. దీంతో బాధ, ఆందోళన, ఒంటరితనం వంటి భావాలను బయటపెట్టడానికి చాలామంది వెనకాడతారు. సమస్య తీవ్రమైన తర్వాతే సాయం కోసం ముందుకు వస్తారని మానసిక వైద్యులు పేర్కొంటున్నారు.

తాజా అధ్యయనాల ప్రకారం ఉద్యోగాల్లో ఉన్న పురుషుల్లో ఆందోళన, డిప్రెషన్‌ కేసులు మహిళల కంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయినా వారు ‘‘నాకు డిప్రెషన్‌ ఉంది’’ అని చెప్పడం కంటే ‘‘బాగా ఒత్తిడిగా ఉంది’’, ‘‘చాలా అలసిపోయాను’’, ‘‘పని భారం ఎక్కువైంది’’ అని మాత్రమే చెబుతుంటారు. దీంతో అసలు మానసిక సమస్యను కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, వైద్యులు కూడా గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతోంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భావాలను అణచిపెట్టడం వల్ల కోపం, చిరాకు, అందరికీ దూరంగా ఉండడం, పనిలో పూర్తిగా మునిగిపోవడం, మద్యం అలవాటు పెరగడం, తరచూ తలనొప్పి, అలసట వంటి రూపాల్లో సమస్య బయటపడుతుంది. ఇవి మానసిక ఆరోగ్య సమస్యల సంకేతాలే అయినా చాలాసార్లు సాధారణ ఒత్తిడిగా భావించి నిర్లక్ష్యం చేస్తున్నారు.

ఈ పరిస్థితి మారాలంటే సమాజ దృక్పథంలో మార్పు రావాలని వైద్యులు సూచిస్తున్నారు. భావాలను పంచుకోవడం బలహీనత కాదని, అవసరమైనప్పుడు మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవడం ధైర్యానికి నిదర్శనమని చెబుతున్నారు.

కుటుంబాలు, ఉద్యోగుల యాజమాన్యాలు, సమాజం కలిసి పురుషులు ఎలాంటి భయం లేకుండా తమ మనసులోని మాట చెప్పగలిగే వాతావరణాన్ని కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. సమస్యను దాచిపెట్టడం కంటే సమయానికి సాయం తీసుకోవడం వల్ల కోలుకునే అవకాశాలు మెరుగవుతాయని స్పష్టం చేస్తున్నారు.
Mens Mental Health
Male Depression Symptoms
Men Hiding Emotions
Mental Health Awareness
Societal Pressure on Men
Anxiety in Men

More Telugu News