24 వారాల్లో 25 కిలోలు తగ్గిన ఫిట్‌నెస్‌ కోచ్‌.. 3 సింపుల్‌ చిట్కాలు!

Fitness coach lost 25 kg in 24 weeks with 3 simple tips
  • 101 కిలోల నుంచి 76 కిలోలకు తగ్గిన జీషన్ అలీ
  • క్రాష్‌ డైట్లు, సప్లిమెంట్లు పాటించలేదని వెల్లడి
  • నిద్ర, నీళ్లు, రొటీన్‌కు ప్రాధాన్యమిచ్చానన్న ఫిట్‌నెస్‌ కోచ్‌
  • రోజూ 180-200 గ్రాముల ప్రోటీన్‌ తీసుకోవాలని సూచన
  • 40 ఏళ్లు దాటినా బరువు తగ్గొచ్చని స్పష్టీకరణ
సోషల్‌ మీడియాలో ప్రతిరోజూ కొత్త కొత్త వెయిట్‌ లాస్‌ చిట్కాలు కనిపిస్తూనే ఉంటాయి. కానీ వాటన్నింటికీ భిన్నంగా ఓ ఫిట్‌నెస్‌ కోచ్‌ చెప్పిన మూడు సాధారణ అలవాట్లు ఇప్పుడు వేల మందిని ఆకట్టుకుంటున్నాయి. వాటినే క్రమంగా పాటించి ఆయన 24 వారాల్లో ఏకంగా 25 కిలోలు తగ్గాడు. 

46 ఏళ్ల ఫిట్‌నెస్‌ కోచ్‌ జీషన్‌ అలీ బరువు తగ్గిన తన ప్రయాణాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఎలాంటి క్రాష్‌ డైట్లు, ఖరీదైన సప్లిమెంట్లు, గంటల తరబడి జిమ్‌లో కసరత్తులు లేకుండానే 101 కిలోల నుంచి 76 కిలోలకు చేరుకున్నట్లు వెల్లడించారు. బరువు తగ్గడం శిక్ష కాదని, జీవితాంతం కొనసాగించగలిగే అలవాట్లను ఏర్పరుచుకోవడమే అసలు విజయ రహస్యమని చెప్పారు.

జీషన్‌ అలీ ప్రకారం.. ఆకలితో ఉండడం వల్ల జంక్‌ ఫుడ్‌ తినాలనే కోరిక పెరుగుతుందని, దాంతో బరువు తగ్గే లక్ష్యం దెబ్బతింటుందని తెలిపారు. అందుకే తాను మూడు సులభమైన నియమాలను మాత్రమే పాటించానని చెప్పారు.

1. నిద్ర, నీళ్లకు ప్రాధాన్యం
రోజూ రాత్రి 10:30 గంటలకే నిద్రపోయేవాడినని, రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీరు తాగేవాడినని చెప్పారు. సరిపడా నిద్ర వల్ల శరీరానికి శక్తి లభిస్తుందని, ఎక్కువ నీరు తాగడం వల్ల ఆకలి తగ్గి అనవసరంగా తినాలనే కోరికలు అదుపులో ఉంటాయని వివరించారు.

2. రోజూ ఒకే రొటీన్‌
నిద్ర, వ్యాయామం, నడక వంటి వాటికి ముందుగానే సమయం నిర్ణయించుకుని అదే షెడ్యూల్‌ను రోజూ పాటించానని తెలిపారు. రొటీన్‌ ఉంటే పనుల ఒత్తిడి లేదా ఇతర కారణాలు లక్ష్యాన్ని దెబ్బతీయలేవని చెప్పారు. ప్రణాళికను కాగితంపై రాసుకోవడం కూడా మంచి అలవాటేనని సూచించారు.

3. ప్రొటీన్‌ను తగ్గించొద్దు
బరువు తగ్గే సమయంలో చాలామంది తినే ఆహారాన్ని పూర్తిగా తగ్గిస్తారని, కానీ ప్రోటీన్‌ను మాత్రం తగ్గించకూడదని జీషన్‌ సూచించారు. తాను రోజుకు 180 నుంచి 200 గ్రాముల ప్రొటీన్‌ తీసుకునేవాడినని తెలిపారు. దీంతో కండరాలు దృఢంగా ఉండటంతో పాటు ఆకలి కూడా అదుపులో ఉంటుందని, మెటబాలిజం మెరుగుపడి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు వేగంగా కరుగుతుందని చెప్పారు.

కేవలం ఆరు నెలల్లోపు 25 కిలోలు తగ్గానని, ఇప్పుడు గతంలో కంటే ఆరోగ్యంగా, దృఢంగా, ఉత్సాహంగా ఉన్నానని జీషన్‌ తెలిపారు. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన తర్వాత బరువు తగ్గడం అసాధ్యం కాదని, సరైన నిద్ర, మంచి ఆహారం, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ఉంటే ఎవరైనా బరువు తగ్గవచ్చని సూచించారు.
Zeeshan Ali
Weight loss transformation
Fitness coach tips
Protein for weight loss
Sustainable health habits
Natural fat loss

More Telugu News