- 2022లో మునావర్ ఫారూఖీ షోను వ్యతిరేకించిన రాజాసింగ్
- దేశవ్యాప్తంగా దుమారం రేపిన రాజాసింగ్ వీడియో
- మంగళ్‌హాట్ పీఎస్ లో కేసులు నమోదు
- కేసును పూర్తిగా కొట్టివేసిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు నుంచి భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసును కోర్టు పూర్తిగా కొట్టివేస్తూ, రాజాసింగ్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తుది తీర్పునిచ్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఆయనపై మోపిన ఆరోపణలకు సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది.
కేసు వివరాల్లోకి వెళితే... 2022 ఆగస్టులో హైదరాబాద్‌లో స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ షో నిర్వహించడాన్ని రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఆయన యూట్యూబ్‌లో విడుదల చేసిన ఒక వీడియో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. రాజాసింగ్ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన మంగళ్‌హాట్ పోలీసులు ఆయనపై 153A, 295A, 505(2) తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
2022 ఆగస్టు 23న పోలీసులు రాజాసింగ్‌ను అరెస్ట్ చేసినప్పటికీ, అరెస్ట్ ప్రక్రియలో సరైన నిబంధనలు (41A సీఆర్‌పీసీ నోటీసు వంటివి) పాటించలేదంటూ స్థానిక కోర్టు రిమాండ్‌ను తిరస్కరించి, ఆయనను వెంటనే విడుదల చేసింది. అయితే, ఆ తర్వాత నగరంలో చోటుచేసుకున్న నిరసనలు, శాంతిభద్రతల సమస్యలను కారణాంగా చూపిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పోలీసులు ఆయనపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. దీంతో రాజాసింగ్ దాదాపు 77 రోజుల పాటు జైలులో గడపాల్సి వచ్చింది.