సీఎం విజయ్ ఖాళీ చేసిన స్థానం నుంచి పోటీ.. క్లారిటీ ఇచ్చిన లారెన్స్
- టీవీకే తరఫున పోటీ వార్తలను ఖండించిన లారెన్స్
- ప్రజాసేవే తన ప్రధాన లక్ష్యమన్న నటుడు
- 60 మంది పిల్లల బాధ్యతలు చూస్తున్నట్లు వెల్లడి
- తల్లి సూచనతో వివరణ ఇచ్చినట్లు వెల్లడి
- నిర్ణయం విజయ్‌దేనని స్పష్టీకరణ
ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీయడంతో లారెన్స్ కొత్త వీడియో విడుదల చేశారు. తన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. తన తల్లి, సన్నిహితులు, తన సేవా సంస్థ సభ్యుల సూచనతోనే ప్రజలకు వివరణ ఇవ్వాల్సి వచ్చిందన్నారు.
ఈ సందర్భంగా గత 20 ఏళ్లుగా తాను ఆర్థికంగా, వైద్యపరంగా ఆదుకుంటున్న రాజగోపాల్ అనే దివ్యాంగుడిని పరిచయం చేశారు. అతడితో జరిగిన అనుభవాలను వివరించిన లారెన్స్, ఒకరికి సేవ చేయడమే ఎంత బాధ్యతతో కూడుకున్నదో చెప్పారు. ప్రస్తుతం దాదాపు 60 మంది పిల్లల విద్య, సంరక్షణ బాధ్యతలను కూడా తానే చూసుకుంటున్నానని వెల్లడించారు.
కొన్ని రోజుల క్రితం తాను ఆదుకున్న పిల్లలంతా కలిసి ఫాదర్స్ డే సందర్భంగా తనను సత్కరించారని, అది జీవితంలో మరచిపోలేని క్షణమని చెప్పారు. ప్రజల ప్రేమ వల్లే ఈ స్థాయికి వచ్చానని, తనపై వస్తున్న విమర్శలు వ్యక్తిగతంగా ఎంతో బాధించాయని పేర్కొన్నారు. ఈ పరిణామాలతో తన తల్లి కూడా తీవ్ర ఆవేదనకు గురై, రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరిందన్నారు.
రాజకీయాల్లోకి రావాలా వద్దా అని ప్రజలనే అడిగానని, అందులో తప్పేముందని కూడా ప్రశ్నించారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చింది ప్రజలేనని, అందుకే వారి అభిప్రాయానికి విలువ ఇస్తానన్నారు.
తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానన్న ప్రచారాన్ని లారెస్ట్ ఖండించారు.ఆ నిర్ణయం పూర్తిగా విజయ్ తీసుకోవాల్సిన విషయమని చెప్పారు. ఆ నియోజకవర్గంలో చాలా కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు ఉన్నారని, వారి కష్టాన్ని పక్కనబెట్టి తాను ముందుకు రావాలని అనుకోవడం లేదన్నారు.
ప్రస్తుతం ‘బెంజ్’, ‘కాంచన 4’ చిత్రాల షూటింగ్లో బిజీగా ఉన్నానని, త్వరలోనే తన రాజకీయ భవిష్యత్‌పై పూర్తి వివరాలు వెల్లడిస్తానని లారెన్స్ చెప్పారు.