భారత్‌కు తీవ్ర నీటి ముప్పు.. అదే సమయంలో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం!

India faces severe water threat and 20 lakh crore investment opportunity
  • 2030 నాటికి అందుబాటులో ఉన్న నీటి సరఫరాకు రెట్టింపు డిమాండ్
  • నీటి రంగంలో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడి అవకాశాలున్నాయని అంచనా
  • పీఎల్ క్యాపిటల్ నివేదికలో వెల్లడైన కీలక వాస్తవాలు
  • మురుగునీటి శుద్ధి రంగంలోనే అతిపెద్ద అవకాశాలున్నాయని వెల్లడి
  • 'జల్ జీవన్ మిషన్', 'నమామి గంగే' వంటి పథకాలతో ప్రభుత్వ చర్యలు
భారతదేశం రానున్న రోజుల్లో తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందా? ఈ ప్రశ్నకు సమాధానంగా... 2030 నాటికి దేశంలో అందుబాటులో ఉన్న నీటి సరఫరా కంటే డిమాండ్ రెట్టింపు స్థాయికి చేరుకుంటుందని ఒక నివేదిక హెచ్చరించింది. అయితే, ఈ సంక్షోభమే రాబోయే దశాబ్దంలో సుమారు రూ.20 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి అవకాశాలకు మార్గం సుగమం చేయనుందని పీఎల్ క్యాపిటల్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా జల శుద్ధి (వాటర్ ట్రీట్‌మెంట్), మురుగునీటి రీసైక్లింగ్, మురుగునీటి పారుదల మౌలిక సదుపాయాల రంగాల్లో ఈ అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

ప్రపంచ జనాభాలో దాదాపు 18 శాతం వాటా ఉన్న భారత్‌లో, ప్రపంచంలోని మంచినీటి వనరుల్లో కేవలం 4 శాతం మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వేగవంతమైన పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, భూగర్భ జలాల క్షీణత, వ్యవసాయానికి నీటి వినియోగం పెరగడం వంటి కారణాలతో నీటి కొరత తీవ్రమవుతోంది. ఈ పరిస్థితుల్లో నీటి భద్రత అనేది దేశానికి అత్యంత కీలకమైన అంశంగా మారిందని, దీనికోసం జల శుద్ధి, రీసైక్లింగ్, పంపిణీ, నిల్వ వ్యవస్థలపై భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని నివేదిక నొక్కి చెప్పింది.

"ఇతర మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులు ఆర్థిక అంశాలతో ముడిపడి ఉండవచ్చు. కానీ, నీటి భద్రతకు సంబంధించిన పెట్టుబడులు నిర్మాణాత్మకమైనవి, విధానపరమైనవి, దేశ సుస్థిర అభివృద్ధికి ఇవి తప్పనిసరి" అని పీఎల్ క్యాపిటల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ విక్రమ్ కసత్ వివరించారు. పట్టణీకరణ, పారిశ్రామిక వృద్ధి, పర్యావరణ ప్రమాణాలు పెరగడం వల్ల నీటి శుద్ధి, పునర్వినియోగం, డీశాలినేషన్ వంటి రంగాలకు దీర్ఘకాలికంగా ఉంటుందని ఆయన తెలిపారు.

మురుగునీటి శుద్ధి రంగంలోనే అతిపెద్ద అవకాశాలు ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా రోజుకు 72,000 మిలియన్ లీటర్లకు పైగా మురుగునీరు ఉత్పత్తి అవుతుండగా, దానిని శుద్ధి చేసే సామర్థ్యం చాలా తక్కువగా ఉంది. శుద్ధి చేయని నీరు నేరుగా పర్యావరణంలోకి విడుదల కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మౌలిక సదుపాయాల లోటును పూడ్చేందుకు మురుగునీటి శుద్ధి, పునర్వినియోగ ప్రాజెక్టులపై పెట్టుబడులు వెల్లువెత్తే అవకాశం ఉంది.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 'జల్ జీవన్ మిషన్', 'అమృత్ 2.0', 'నమామి గంగే' వంటి పథకాల ద్వారా స్వచ్ఛమైన నీటి లభ్యత, మెరుగైన మురుగునీటి వ్యవస్థల కోసం కేటాయింపులు పెంచింది. మరోవైపు డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి కొత్త పరిశ్రమలకు అత్యంత స్వచ్ఛమైన నీరు అవసరం కానుండటంతో పారిశ్రామిక నీటి డిమాండ్ మరింత పెరగనుంది.
India Water Crisis
PL Capital Report
Water Infrastructure Investment
Sewage Treatment Plants
Jal Jeevan Mission
Water Recycling India

More Telugu News