ఓటు పోతే ప్రభుత్వ పథకాలూ పోవచ్చు.. ‘సర్’పై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
- ఓటు హక్కు కోల్పోవద్దని డీకే శివకుమార్ సూచన
- ఓటు లేకపోతే పథకాలపై ప్రభావం ఉంటుందని హెచ్చరిక
- కర్ణాటకలో మంగళవారం నుంచి ప్రత్యేక ఓటరు సవరణ ప్రారంభం
- జులై 29 వరకు ఇంటింటి సర్వే
- అక్టోబర్ 7న తుది ఓటరు జాబితా విడుదల
కర్ణాటకలో మంగళవారం నుంచి సర్ ప్రారంభమైంది. జులై 29 వరకు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించే ప్రక్రియ కొనసాగనుంది. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ‘‘ఓటు హక్కు అంటే జీవించే హక్కు’’ అని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌లో ‘సర్’ ఆధారంగా అర్హత లేని రేషన్ కార్డుదారులను తొలగించే చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఇదే దిశగా అడుగులు వేస్తున్నాయని తెలిపారు. అందుకే ఓటు హక్కును నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు.
ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని నిర్ణయించింది. దీన్ని ఆన్‌లైన్‌తో పాటు సేవా కేంద్రాల ద్వారా కూడా పొందే అవకాశం కల్పించింది. ఓటరు వివరాల ధ్రువీకరణలో ఇది నివాస ఆధారంగా ఉపయోగపడనుంది.
ఈ దశలో ఎలాంటి పత్రాలు తీసుకోబోమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఫారం పూర్తిగా నింపి సంతకం చేసి అధికారులకు అందజేయాలని ఓటర్లను కోరింది. మొత్తం ప్రక్రియ ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారమే జరుగుతుందని, ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దని అధికారులు తెలిపారు.
ఆగస్టు 5న ముసాయిదా ఓటరు జాబితా విడుదల కానుంది. సెప్టెంబర్ 4 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. తుది ఓటరు జాబితాను అక్టోబర్ 7న ప్రకటించనున్నారు.