మనుషుల కోసం కాదా... అసలు ఏసీని కనిపెట్టింది ఎందుకో తెలుసా?
- మనుషుల సౌకర్యం కోసం కాకుండా పారిశ్రామిక అవసరం కోసం ఏసీ ఆవిష్కరణ
- ప్రింటింగ్ ప్రెస్ లో తేమను నియంత్రించేందుకు 1902లో తొలి ఏసీ రూపకల్పన
- ఈ టెక్నాలజీ అభివృద్ధి చేసిన అమెరికన్ ఇంజనీర్ విల్లీస్ క్యారియర్
- దాదాపు 20 ఏళ్ల తర్వాత సినిమా థియేటర్ల ద్వారా ప్రజలకు పరిచయం
- పరిశ్రమల నుంచి ఇళ్ల వరకు ఇలా సాగిన ఏసీ ప్రస్థానం
1902లో అమెరికన్ ఇంజనీర్ విల్లీస్ క్యారియర్, ఆధునిక ఎలక్ట్రికల్ ఏసీ వ్యవస్థను తొలిసారిగా అభివృద్ధి చేశారు. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న 'సాకెట్ అండ్ విల్హెమ్స్' అనే ప్రింటింగ్ ప్రెస్ కంపెనీలో ఉన్న ఓ సమస్యే ఈ ఆవిష్కరణకు కారణమైంది. గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల అక్కడి కాగితం (పేపర్) ఉబ్బి, రంగుల అలైన్‌మెంట్ దెబ్బతినేది. దీంతో ప్రింటింగ్ నాణ్యత పడిపోయేది.
ఈ సమస్యను అధిగమించేందుకు, విల్లీస్ క్యారియర్ ఉష్ణోగ్రతతో పాటు తేమను నియంత్రించే ఒక పరికరాన్ని రూపొందించారు. చల్లటి నీటిని కాయిల్స్ ద్వారా పంపి, దానిపై నుంచి వేడి గాలిని ఫ్యాన్లతో పంపేవారు. దీంతో గాలి చల్లబడి, తేమ ఘనీభవించి పొడి గాలి బయటకు వచ్చేది. ఇలా ప్రింటింగ్‌కు అవసరమైన వాతావరణాన్ని సృష్టించారు. దీనికే ఆయన "గాలిని శుద్ధి చేసే పరికరం" (Apparatus for Treating Air) అనే పేరుతో పేటెంట్ పొందారు.
దాదాపు రెండు దశాబ్దాల పాటు ఈ టెక్నాలజీ వస్త్ర, పొగాకు, ఫిల్మ్, ఆహార శుద్ధి కర్మాగారాలకే పరిమితమైంది. 1920ల నుంచి సినిమా థియేటర్లు, డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌లో ఏసీలను వాడటం మొదలుపెట్టారు. అప్పటి నుంచే ఏసీలకు ప్రజాదరణ పెరిగి, క్రమంగా ఇళ్లలోకి కూడా ప్రవేశించింది. ఒక పారిశ్రామిక సాధనంగా మొదలైన ఏసీ, నేడు ఆధునిక జీవనశైలిలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది.