అమరావతిలో ప్రజల తిరుగుబాటుతో వైసీపీ తోక ముడిచింది: మంత్రి గొట్టిపాటి రవికుమార్

Gottipati Ravi Kumar says YCP retreated due to public revolt in Amaravati
  • అమరావతిలో ప్రజా తిరుగుబాటుతో వైసీపీ వెనక్కి తగ్గిందన్న మంత్రి గొట్టిపాటి
  • వైసీపీ కుట్రలను మహిళలు, రైతులే అడ్డుకున్నారని వ్యాఖ్య
  • అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానుల పేరుతో అభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శ
  • నేర రాజకీయాలను ప్రభుత్వం సహించబోదని స్పష్టీకరణ
  • ప్రజలను మభ్యపెట్టడమే వైసీపీ లక్ష్యంగా మారిందని ఆరోపణ
శనివారం నాడు అమరావతిలో జరిగిన ప్రజా తిరుగుబాటుతో వైసీపీ అల్లరి మూకలు తోక ముడిచాయని, వారి కుట్ర రాజకీయాలను స్థానిక మహిళలు, రైతులే సమర్థంగా తిప్పికొట్టారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కుట్రల ముసుగులో మరోసారి ప్రజలను మోసం చేయాలని ప్రయత్నించిన వైసీపీ నేతలను అమరావతి వాసులు గట్టిగా నిలదీసి వెనక్కి పంపారని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల పేరుతో నేరాలకు పాల్పడే వారిని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని, ఈ విషయంలో ప్రభుత్వం, ప్రజలు ఒకే స్పష్టతతో ఉన్నారనడానికి అమరావతి ఘటనే నిదర్శనమని వ్యాఖ్యానించారు.

గత ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేసిన వైసీపీ ప్రభుత్వం, ఏ ఒక్క ప్రాంతంలోనూ గుప్పెడు మట్టి కూడా వేయలేదని మంత్రి గొట్టిపాటి విమర్శించారు. తమ విధ్వంసకర విధానాలతో అమరావతితో పాటు యావత్ రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరిచారని తీవ్ర ఆరోపణలు చేశారు. 

అధికారం కోల్పోయిన తర్వాత కూడా వైసీపీ నాయకత్వం తన వైఖరి మార్చుకోలేదని, ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు రోజుకో కొత్త నాటకానికి తెరలేపుతోందని అన్నారు. ఏ అంశంపైనా స్థిరమైన వైఖరి లేకుండా కేవలం ప్రజలను మభ్యపెట్టడమే ఆ పార్టీ ఏకైక లక్ష్యంగా మారిందని దుయ్యబట్టారు.

వైసీపీ ఇదే ధోరణిని కొనసాగిస్తే, ప్రజల్లో ఆ పార్టీకి మిగిలిన కొద్దిపాటి విశ్వాసం కూడా పూర్తిగా ఆవిరైపోతుందని మంత్రి గొట్టిపాటి హెచ్చరించారు. అమరావతిలో మహిళలు, రైతులు వ్యక్తం చేసిన నిరసన ప్రజల మనోభావాలకు అద్దం పట్టిందన్నారు. 

తమ ప్రభుత్వం అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని, అలాంటి ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని ఆయన తేల్చిచెప్పారు. ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని, ఆ దిశగానే ప్రభుత్వ పాలన సాగుతుందని మంత్రి వివరించారు.


Gottipati Ravi Kumar
YSR Congress Party
Amaravati farmers protest
Andhra Pradesh politics
Amaravati development
YCP leaders backlash

More Telugu News