చరిత్రకు అపఖ్యాతి... ఆ పేరు చెబితే వ్యభిచార గృహం అనుకుంటున్నారు!
- స్వాతంత్ర్యోద్యమ కేంద్రంగా ఉన్న ముంబై కాంగ్రెస్ హౌస్కు అపఖ్యాతి
- పక్కనే ఉన్న రెడ్ లైట్ ఏరియా కారణంగా బ్రోతల్ హౌస్గా పొరపాటు
- గాంధీ, నెహ్రూ వంటి నేతలు పర్యటించిన చారిత్రక భవనం
- తప్పుడు చిరునామాతో ఇబ్బందులు పడుతున్న 80కి పైగా కుటుంబాలు
- పేరు మారిపోవడంతో తీవ్ర అవమానభారంతో కుమిలిపోతున్న నివాసితులు
అసలేం జరిగింది?
దక్షిణ ముంబైలోని గ్రాంట్ రోడ్ సమీపంలో ఉన్న ఈ కాంగ్రెస్ హౌస్కు ఎదురుగా, కేవలం 20 అడుగుల దూరంలోనే 'ఎన్బీ కాంపౌండ్' అనే రెడ్ లైట్ ఏరియా ఉంది. ఇది ముంబైలోని పురాతన ముజ్రా కేంద్రాల్లో ఒకటి. ఈ రెండు ప్రదేశాలు అత్యంత సమీపంలో ఉండటంతో, చాలామంది ఈ రెండిటినీ ఒకే ప్రదేశంగా భావిస్తున్నారు. ట్యాక్సీ డ్రైవర్ల నుంచి స్థానికుల వరకు చాలామంది ఆ రెడ్ లైట్ ఏరియానే 'కాంగ్రెస్ హౌస్' అని పిలవడం మొదలుపెట్టారు.
చరిత్ర వర్సెస్ వర్తమానం
వాస్తవానికి కాంగ్రెస్ హౌస్ అనేది ఒక చారిత్రక భవనాల సముదాయం. క్విట్ ఇండియా ఉద్యమం సహా ఎన్నో కీలక సమావేశాలకు ఇది వేదికైంది. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, మహమ్మద్ అలీ జిన్నా, సరోజినీ నాయుడు వంటి ప్రముఖులు ఇక్కడ సమావేశమయ్యేవారు. అలాంటి ప్రాధాన్యం ఉన్న ఈ భవన సముదాయంలో ప్రస్తుతం 80కి పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. చారిత్రక భవనానికి పట్టిన ఈ దుస్థితి వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యభిచారం కోసం వచ్చే పురుషులు నేరుగా ఇళ్ల తలుపులు తట్టడం, మహిళలను ఇబ్బంది పెట్టడంతో అక్కడి నివాసితులు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు తీవ్ర అవమానభారం మోస్తున్నారు.
విచిత్రం ఏమిటంటే, ఒకప్పుడు ఇక్కడి తవాయిఫ్లు (రాజనర్తకులు) స్వాతంత్య్ర ఉద్యమ నిధికి విరాళాలు కూడా ఇచ్చారని చరిత్ర చెబుతోంది. ఒకవైపు గుడులు, బడులు, మరోవైపు రెడ్ లైట్ ఏరియా ఉన్న ఈ ప్రాంతంలో... స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తికి ప్రతీకగా నిలవాల్సిన కాంగ్రెస్ హౌస్, ఇప్పుడు తప్పుడు కారణాలతో వార్తల్లో నిలుస్తోంది.