ఈ చెరకు రసం అమ్మే వ్యక్తి తెలివి చూస్తే.. ఎంబీఏ కూడా చిన్నదే!
- చెరకు రసం ధరల బోర్డు సోషల్ మీడియాలో వైరల్
- ఐస్‌తో, ఐస్ లేకుండా వేర్వేరు ధరల నిర్ణయం
- హాఫ్ గ్లాస్‌కు ప్రత్యేక ధరతో మరో ఆప్షన్
- వ్యాపారి బిజినెస్ సెన్స్‌పై ప్రశంసల వెల్లువ
- ‘స్టార్టప్ ఫౌండర్ల కంటే తెలివి’ అన్న ఎంటరేజ్ వ్యవస్థాపకురాలు
ఆ వ్యక్తి బిజినెస్ సెన్స్‌ను ప్రశంసిస్తూ ‘ఎంటరేజ్’ సంస్థ వ్యవస్థాపకురాలు అనన్య నారంగ్ లింక్డిన్లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఆమె షేర్ చేసిన ఫొటోలో చెరకు రసం ధరల బోర్డు ఇలా ఉంది.. ఐస్ లేకుండా గ్లాస్ రూ.30, ఐస్‌తో గ్లాస్ రూ.25, హాఫ్ గ్లాస్ రూ.20.
మొదట చూస్తే ఇది సాధారణ ధరల జాబితాలా కనిపించినా.. దీని వెనుక మంచి వ్యాపార వ్యూహం ఉందని అనన్య పేర్కొన్నారు. ‘‘ఈ వ్యాపారి చాలా మంది స్టార్టప్ వ్యవస్థాపకుల కంటే యూనిట్ ఎకనామిక్స్‌ను బాగా అర్థం చేసుకున్నాడు’’ అని వ్యాఖ్యానించారు. యూనిట్ ఎకనామిక్స్ అంటే ఒక్కో వస్తువు అమ్మకంపై వచ్చే ఖర్చు, ఆదాయం, లాభాన్ని లెక్కించి ధర నిర్ణయించే పద్ధతి.
ఈ ధరల బోర్డు వెనుక చిన్న బిజినెస్ వ్యూహం దాగి ఉంది. ఐస్‌తో జ్యూస్‌కు తక్కువ ధర పెట్టడం వల్ల చెరకు రసం తక్కువ వాడాల్సి వస్తుంది. దీంతో విక్రేత ఖర్చు తగ్గుతుంది. అదే సమయంలో హాఫ్ గ్లాస్‌కు రూ.20 వసూలు చేయడం ద్వారా తక్కువ పరిమాణంలోనే ఎక్కువ లాభం పొందేలా ధర నిర్ణయించాడు. ఇలా కస్టమర్లను ఆకర్షిస్తూనే తన లాభాన్నీ కాపాడుకునే ఎత్తుగడను అమలు చేశాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘‘చిన్న వ్యాపారులే కస్టమర్ల మనస్తత్వాన్ని బాగా అర్థం చేసుకుంటారు’’ అని కొందరు అభిప్రాయపడ్డారు. ‘‘ఇలాంటి వారి దగ్గరే ఎంబీఏ పాఠాలు నేర్చుకోవాలి’’ అంటూ ఇంకొందరు సరదాగా వ్యాఖ్యానించారు.