ఎంపీల ఫోన్లు స్విచ్ఛాఫ్.. ‘ఉద్ధవ్ సేన’లో తిరుగుబాటు ఆందోళన!
- ఆరుగురు ఎంపీలు షిండే శిబిరంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం
- కొందరు ఎంపీల ఫోన్లు స్విచ్ఛాఫ్ కావడంతో ఉద్ధవ్ వర్గంలో ఆందోళన
- ఢిల్లీలో షిండే వర్గ నేతలతో ఎంపీల సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు
- తలుపులు తెరిచి ఉన్నాయని మంత్రి ప్రతాప్ సార్నాయక్ వ్యాఖ్య
- ఎంపీల కొనుగోలుకు ఒక్కొక్కరికి రూ.15 కోట్లు ఇస్తున్నారని సంజయ్ రౌత్ ఆరోపణ
పార్టీ సీనియర్ నేతలు సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ కొందరు ఎంపీల ఫోన్లు స్విచ్ఛాఫ్‌గా ఉండటంతో ఉద్ధవ్ వర్గంలో ఆందోళన నెలకొంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఉద్ధవ్ ఠాక్రే స్వయంగా రంగంలోకి దిగినట్లు సమాచారం.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం యూబీటీకి చెందిన సంజయ్ దినా పాటిల్, సంజయ్ దేశ్‌ముఖ్, నగేశ్ పాటిల్ అష్టికర్, ఓంరాజే నింబాల్కర్, భౌసాహెబ్ వక్చౌరే, సంజయ్ జాధవ్ తదితరులు షిండే వర్గంతో సంప్రదింపులు జరుపుతున్నారు. మరో ఎంపీ రాజాభౌ వాజే పేరు కూడా వినిపిస్తోంది.
ఈ ఎంపీలు ఢిల్లీలో షిండే వర్గానికి చెందిన లోక్‌సభ సభ్యుడు శ్రీకాంత్ షిండే నివాసంలో సమావేశమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ప్రత్యేక పార్లమెంటరీ వర్గం ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి, తర్వాత షిండే నేతృత్వంలోని శివసేనలో విలీనం కావచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తిరుగుబాటు నేతలను స్వాగతిస్తామని మహారాష్ట్ర మంత్రి ప్రతాప్ సార్నాయక్ ప్రకటించడం రాజకీయ చర్చకు దారితీసింది. బాల్ ఠాక్రే సిద్ధాంతాలను నమ్మి ఏక్‌నాథ్ షిండే నాయకత్వంపై విశ్వాసం ఉంచేవారికి శివసేన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు యూబీటీ నేత సంజయ్ రౌత్ మాత్రం తిరుగుబాటు వార్తలను ఖండించారు. పార్టీ ఎంపీలంతా ఉద్ధవ్ ఠాక్రేతోనే ఉన్నారని స్పష్టం చేశారు. ఎంపీలను కొనుగోలు చేసేందుకు ఒక్కొక్కరికీ రూ.15 కోట్ల చొప్పున అడ్వాన్స్‌లు ఇస్తున్నారని ఆరోపించారు. అయితే పార్టీ చీలికపై వస్తున్న వార్తలను యూబీటీ నేతలు కొట్టిపారేస్తుండగా ఢిల్లీలో జరగనున్న సమావేశాలపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.