బహుళ ప్రశంసలు పొందిన ‘రేణిగుంట’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘రేణిగుంట 2’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి శనివారం విడుదల చేశారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను తన ఎక్స్ ఖాతాలో పంచుకుంటూ, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు ఆర్. పనీర్ సెల్వం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

2009లో విడుదలైన ‘రేణిగుంట’ చిత్రం విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు అందుకొని ఘన విజయం సాధించింది. బాల నేరస్థుల గృహం నుంచి తప్పించుకొని ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్న ఐదుగురు యువకుల కథతో ఈ సినిమా తెరకెక్కింది. అప్పటివరకు తమిళ ప్రేక్షకులు చూడని సరికొత్త క్రైమ్ ప్రపంచాన్ని పనీర్ సెల్వం ఆవిష్కరించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వస్తున్న ‘రేణిగుంట 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

‘రేణిగుంట 2’ మొదటి భాగం కంటే మరింత గ్రిప్పింగ్‌గా, వేగవంతమైన కథనంతో ఉండనుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ సీక్వెల్‌కు పనీర్ సెల్వం దర్శకత్వం వహించడమే కాకుండా, నిర్మాతగానూ వ్యవహరిస్తుండటం విశేషం.

ఈ చిత్రంలో జానీ, శాలి నివేకాస్, అభిమన్యు షామి తిలకన్, నిశాంత్, కనిఫా, తమిళసెల్వం, సుందీప్, వేలా రామమూర్తి, హరీశ్ పేరడి, సుజాత, సురభి తదితరులు నటిస్తున్నారు. మను రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా, ఆర్.బి. గురుదేవ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తున్నారు. ఆంటోనీ ఎడిటింగ్, రాజశేఖర్ స్టంట్స్ అందిస్తున్నారు.