రుతుపవనాలు వచ్చేశాయి.. ఏపీలో వర్షపాతం అంచనాలు ఇవిగో!
- ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
- రాయలసీమ ప్రాంతాన్ని తొలుత తాకినట్లు ప్రకటించిన విపత్తుల నిర్వహణ సంస్థ
- ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం
- తరచూ విరామాలు తీసుకుంటూ రుతుపవనాల గమనం సాగే సూచనలు
- కొన్ని జిల్లాల్లో వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలకు అవకాశం
ఈ నైరుతి రుతుపవనాల సీజన్లో (జూన్-సెప్టెంబర్ 2026) రాష్ట్రంలో వర్షపాతంపై ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ కీలక వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది రాష్ట్రంలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఆయన వివరించారు.
రుతుపవనాల గమనంలో తరచూ విరామాలు ఏర్పడవచ్చని, అంటే కొన్ని రోజుల పాటు వర్షాలు కురిసి, ఆ తర్వాత కొంతకాలం వాతావరణం పొడిగా ఉండే సూచనలున్నాయని తెలిపారు. స్థానికంగా ఏర్పడే వాతావరణ మార్పుల వల్ల కురిసే వర్షాలు ఈ లోటును కొంతమేర భర్తీ చేయవచ్చని అంచనా వేశారు. మారుతున్న పరిస్థితులను గమనిస్తూ పంట ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రైతులకు సూచించారు.
వివిధ ప్రాంతాల్లో వర్షపాత అంచనాలు:
సాధారణం కంటే తక్కువ: తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, పోలవరం, కర్నూలు, నంద్యాల, మార్కాపురం, అనంతపురం, కడప, నెల్లూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షపాతం తక్కువగా ఉండనుంది.
సాధారణం కంటే ఎక్కువ: ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఊరటనిచ్చేలా అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సాధారణ వర్షపాతం: శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో సాధారణ స్థాయిలో వర్షాలు పడనున్నాయి.
రానున్న రెండు రోజుల్లో వాతావరణం
ఆది, సోమవారాల్లో కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడొచ్చు. అదే సమయంలో ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, కోనసీమ సహా పలు జిల్లాల్లో 42-44 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడరాదని, రైతులు, పశువుల కాపరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.