భారతదేశంలో ఇంటీరియర్ డిజైన్ రంగం నిశ్శబ్దంగా ఓ కొత్త శకంలోకి అడుగుపెడుతోంది. ఒకప్పుడు ఇంటికి మంచి లుక్ తీసుకురావాలంటే ఎంతో సమయం, డబ్బు ఖర్చు చేయడమే కాకుండా.. పనుల సమయంలో ఇల్లంతా చిందరవందరగా మారేది. అందమైన డిజైన్ కావాలంటే ఈ తలనొప్పులన్నీ తప్పవని చాలామంది రాజీపడేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారుతోంది. నాణ్యత, డిజైన్ విషయంలో రాజీ పడకుండానే.. తక్కువ సమయంలో, చాలా సులభంగా పూర్తిచేయగల సరికొత్త విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి.

గతంలో మంచి ఫినిషింగ్, సులభమైన ఇన్‌స్టాలేషన్ అనేవి రెండూ ఒకేసారి సాధ్యమయ్యేవి కావు. కానీ నేడు అత్యాధునిక టెక్నాలజీతో ఇది సాధ్యమవుతోంది. చూడటానికి అచ్చం చెక్కలా కనిపించే సీలింగ్ సిస్టమ్స్, కాంపోజిట్ వాల్ ప్యానెల్స్ వంటివి ఎలాంటి అదనపు పాలిషింగ్, పెయింటింగ్ అవసరం లేకుండా నేరుగా బిగించవచ్చు. దీనివల్ల ప్రత్యేక నైపుణ్యం ఉన్న కార్మికుల అవసరం తగ్గడమే కాకుండా, సైట్‌లో దుమ్ము, వ్యర్థాలు, నిర్మాణ సామాగ్రి వంటి సమస్యలు కూడా గణనీయంగా తగ్గుతాయి. ఫలితంగా పనులు వేగంగా, తప్పులు లేకుండా పూర్తవుతాయి.

ఈ కొత్త విధానంలో ఉపయోగిస్తున్న సర్ఫేస్ సిస్టమ్స్ గోడలు, సీలింగ్‌లు, చివరికి ఇంటి బయట కూడా ఒకే రకమైన మెటీరియల్‌తో డిజైన్ చేసుకునే సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. ఇంజినీర్డ్ ఎక్స్‌టీరియర్-గ్రేడ్ వాల్ ప్యానెల్స్ వంటివి వాతావరణ మార్పులను తట్టుకుంటూ చాలాకాలం మన్నిక ఇస్తాయి. ఇలా అన్నిచోట్లా ఒకే తరహా మెటీరియల్ వాడటం వల్ల ప్రాజెక్ట్ మొత్తం చాలా సరళంగా మారుతుంది. డిజైనర్లు, బిల్డర్లకు పని సులభం అవుతుంది.

ఒకప్పుడు కేవలం లగ్జరీ ఇళ్లు, పెద్ద బడ్జెట్ ప్రాజెక్టులకు మాత్రమే పరిమితమైన వంపు తిరిగిన ప్యానెల్స్, ఆర్గానిక్ ఆకారాలు, అతుకులు కనిపించని లామినేషన్ వంటివి ఇప్పుడు సాధారణ మధ్యతరగతి ఇళ్లు, ఆఫీసు పునరుద్ధరణ పనుల్లో కూడా సాధ్యమవుతున్నాయి. దీనివల్ల ఇంటి యజమానులు తాము ఊహించుకున్న డిజైన్‌ను దాదాపుగా వాస్తవరూపంలోకి తెచ్చుకోగలుగుతున్నారు. 

ముఖ్యంగా సమయం, స్థలం పరిమితంగా ఉండే పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి ఈ మార్పు ఒక వరంలా మారింది. నాణ్యత కోసం సంక్లిష్టతను భరించాలనే పాత ధోరణికి స్వస్తి పలుకుతూ, ఆధునిక మెటీరియల్స్ సాయంతో అందమైన ఇంటీరియర్‌ను సులభంగా, సమర్థవంతంగా పొందడం ఇప్పుడు సాధ్యమవుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.