ఇరాన్‌ యుద్ధం: అబుదాబి కీలక నిర్ణయం.. ప్రవాస భారతీయులకు ఊరట!

Abu Dhabi Freezes Rent Hikes
  • అద్దెల పెంపుపై అబుదాబి నిషేధం
  • యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో నిర్ణయం
  • ఏటా 5 శాతం పెంచుకోవడంపై తాత్కాలిక నిషేధం
  • అక్కడి భారతీయుల ఖర్చుల్లో అద్దె భాగమే ఎక్కువ
  • రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లోనూ స్థిరత్వం
ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అబుదాబి ప్రభుత్వం అక్కడి నివాసితులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఇళ్లు, దుకాణాలు, పారిశ్రామిక భవనాల అద్దెలను ప్రస్తుతానికి పెంచొద్దని ఆదేశాలు జారీ చేసింది. ‘అబుదాబి రియల్ ఎస్టేట్ సెంటర్ (ఏడీఆర్‌ఈసీ) తీసుకున్న ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని అధికారికంగా ప్రకటించింది.

కొత్త నిబంధనల ప్రకారం ప్రస్తుతం అద్దెకు ఉంటున్న వారి కాంట్రాక్టులను పునరుద్ధరించుకునే సమయంలో అద్దెను అస్సలు పెంచకూడదు. ఒకవేళ పాత వాళ్లు ఖాళీ చేసి వెళ్లినా ఆ స్థానంలోకి వచ్చే కొత్త వాళ్లకు కూడా పాత అద్దెనే వర్తింపజేయాలి. గతంలో ఏడాదికి గరిష్ఠంగా ఐదు శాతం వరకు పెంచుకునేందుకు యజమానులకు ఉన్న అవకాశాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది.

‘యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్’లో నివసించే ప్రవాస భారతీయులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటను ఇచ్చింది. అక్కడ నివసించే విదేశీయుల్లో భారతీయుల సంఖ్యే ఎక్కువ. ప్రతినెలా వచ్చే జీతంలో అద్దెకే పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది. ఇప్పుడు అద్దెలు పెరగవు కాబట్టి భారతీయులకు సొమ్ము మిగులుతుంది. చిన్న వ్యాపారులు కూడా తమ ఖర్చులను ముందే ప్లాన్ చేసుకునే అవకాశం దక్కింది.

అబుదాబిలో రియల్ ఎస్టేట్ రంగానికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ సమయంలో అద్దెలను నియంత్రించడం వల్ల మార్కెట్లో స్థిరత్వం వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అద్దెలు విపరీతంగా పెరిగిపోకుండా చూడటంతో పాటు ఇళ్లు మారే ఇబ్బందుల నుంచి ప్రవాస కుటుంబాలకు ఇది రక్షణ కల్పిస్తుంది. ప్రపంచ దేశాల నుంచి వచ్చే ప్రతిభావంతులకు అబుదాబి ఓ సురక్షితమైన వేదికగా మారడానికి ఈ నిర్ణయం దోహదపడుతుంది.

యుద్ధం వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం ప్రభుత్వం వరుసగా తీసుకుంటున్న సహాయక చర్యల్లో ఈ అద్దెల నియంత్రణ కూడా ఓ భాగం. గతంలో విమాన సర్వీసులు రద్దు కావడం వల్ల విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులకు హోటళ్లలో వసతి కల్పించి, ఆ ఖర్చులను ప్రభుత్వమే భరించింది. ఈ అద్దెల నియంత్రణ ఎంతకాలం అమల్లో ఉంటుందనే విషయాన్ని అధికారులు ఇంకా వెల్లడించలేదు.
Go Back to Shorts
Abu Dhabi
Rent Hike
Freeze on Rent Hike
Indians

More Telugu News