ఇరాన్‌ యుద్ధం.. తెరపైకి యూఏఈ రహస్య దాడులు?

UAE Secret Attacks on Iran Revealed Amid War
  • ఇరాన్‌పై యూఏఈ దాడులు చేసినట్లు నివేదికల వెల్లడి
  • ఇంధన కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరిగినట్లు సమాచారం
  • ఎమిరేట్స్‌పై 2,800 క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడినట్లు టాక్
  • ఉమ్మడి సైనిక చర్యను సౌదీ అరేబియా వ్యతిరేకించినట్లు సమాచారం
  • నెతన్యాహు రహస్య యూఏఈ పర్యటనలు చేసినట్లు నివేదికల సారాంశం
ఇరాన్‌పై ఇప్పటి వరకు అమెరికా, ఇజ్రాయెల్‌ మాత్రమే దాడులు చేశాయని యావత్‌ ప్రపంచం భావిస్తూ వచ్చింది. కానీ, పశ్చిమాసియా దేశమైన యూఏఈ కూడా ఇరాన్‌పై దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది. యుద్ధంలో భాగంగా గల్ఫ్‌ దేశాల్లోని భూభాగాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ దాడి చేసిన విషయం తెలిసిందే. తమ దేశంపై దాడిని తీవ్రంగా పరిగణించిన యూఏఈ ఈ దాడులు చేసినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం పేర్కొంది.

ఇంధన వనరులపై
అమెరికా, ఇజ్రాయెల్ ఇచ్చిన నిఘా సమాచారంతో యూఏఈ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. హర్మూజ్‌ జలసంధిలోని దీవులు, ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లపై బాంబుల వర్షం కురిపించినట్లు నివేదికలు చెబుతున్నాయి. గ్యాస్ మౌలిక వసతులపై ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగానే యూఏఈ ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం.

యూఏఈపైకే ఎక్కువ క్షిపణులు
అమెరికా, ఇజ్రాయెల్‌కు సహకరిస్తోందనే కోపంతో యూఏఈని ఇరాన్ తీవ్రంగా టార్గెట్ చేసినట్లు నివేదిక పేర్కొంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఏకంగా 2,800కు పైగా క్షిపణులు, డ్రోన్లను ఎమిరేట్స్‌పైకి  ఇరాన్‌ ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ కంటే కూడా యూఏఈపైనే ఇరాన్ ఎక్కువ దాడులు చేసినట్లు పత్రిక కథనంలో రాసింది.

సౌదీ అరేబియాతో విభేదాలు
ఇరాన్ దాడులపై యూఏఈ కఠిన వైఖరి అవలంబించినట్లు సమాచారం. గల్ఫ్ దేశాలన్నీ కలిసి ఇరాన్‌పై ఉమ్మడి సైనిక చర్యకు దిగాలని ప్రతిపాదించగా సౌదీ అరేబియా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. దాడులు ఆపాలని యూఏఈపై ఒత్తిడి తేవాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సౌదీ కోరినట్లు సమాచారం.

ఇజ్రాయెల్‌తో పెరిగిన రక్షణ బంధం?
యుద్ధ సమయంలో యూఏఈ, ఇజ్రాయెల్ మధ్య రక్షణ సహకారం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇరాన్ క్షిపణుల నుంచి రక్షణ కోసం ఇజ్రాయెల్ తన ‘ఐరన్ డోమ్’ వ్యవస్థలను యూఏఈకి పంపినట్లు సమాచారం. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, నిఘా సంస్థల అధిపతులు రహస్యంగా యూఏఈలో పర్యటించి వ్యూహాలు రచించినట్లు కథనాలు వస్తున్నాయి.
Go Back to Shorts
UAE
Iran war
UAE Iran conflict
Israel
Middle East tensions
Hormuz Strait
oil refinery attack
US military bases
Saudi Arabia
Iron Dome

More Telugu News